- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేర్‌లెస్‌కు కేరాఫ్ అడ్రస్.. కేసముద్రం ఎంపీడీవో ఆఫీసు..!
ఇది ప్రభుత్వ కార్యాలయమా? ప్రైవేట్ ఆఫీసా? అని అనుమానం కలిగేలా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయ పనితీరు ఉంది.

దిశ, కేసముద్రం: ఇది ప్రభుత్వ కార్యాలయమా? ప్రైవేట్ ఆఫీసా? అని అనుమానం కలిగేలా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయ పనితీరు ఉంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో తాళపు చెవి, మాయమయ్యే రికార్డులు.. ఇవన్నీ కలసి ప్రజా పరిపాలనని మసకబారుస్తున్నాయి.
ప్రభుత్వ విధుల్లో ఉన్న అటెండర్లు విధిగా పనిలో ఉండాలి కదా..! కానీ ఇక్కడ మాత్రం అలాంటిదేమీ కనిపించదు. ఇద్దరు అటెండర్లలో ఒకరు డిప్యూటేషన్ పై రాగా, మరొకరు తన బాధ్యతల్ని తనకు చేతకాక ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించేశారు. ఆయన చేతిలో ఇప్పుడు తాళాలు కూడా ఉన్నాయి. రాత్రి ఆఫీసు మూసేది, ఉదయం తెరిచేది అతడే..! అసలు ప్రభుత్వ కార్యాలయానికి తాళం పెట్టే అధికారం ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎలా వచ్చింది? ఇదేనా భద్రతా ప్రమాణాలు.?
ఇదంతా అక్కడే ఆగలేదంటేనే అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. సూపరింటెండెంట్ స్వయంగా ఉదయం ఆలస్యంగా వచ్చి, అందరికంటే ముందే వెళ్లిపోతూ ఉంటాడు. ఇక ఆయన్ను అనుసరిస్తూ, రైలు టైమ్‌కి డిప్యూటేషన్ అటెండర్ వస్తూ పోతూ ఉండటం కూడా చూడవచ్చు. ఉద్యోగుల హాజరు పట్టవలసినవాడే ఇలా వ్యవహరిస్తే, మిగతా సిబ్బందికి చక్కటి ఉదాహరణే కదా..!
బయోమెట్రిక్ అటెండెన్స్ ఉందంటే అది పూజా సామాగ్రుల లిస్టులో భాగమేమో..! ఎందుకంటే సమయపాలన పాటించేది ఎవరూ కనిపించడం లేదు. పైగా ఇటీవల కార్యాలయంలో కొన్ని రికార్డులు మాయమయ్యాయని విశ్వసనీయ సమాచారం. బాధ్యత వహించాల్సిన సూపరింటెండెంట్ కి దీనిపై "దృష్టికి రాలేదు" అన్న స్టాండర్డ్ సమాధానం సిద్ధంగా ఉంది. మరి దృష్టికి రాకపోతే, బాధ్యులు ఎవరు..? ప్రజల రికార్డులు పోతే ఇక బాధ్యత ఎవరిపై..?
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమై కేసముద్రం మండల పరిషత్ కార్యాలయాన్ని పటిష్టంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో, ఈ నిర్లక్ష్యం మరిన్ని అనైతికాలకు తలుపు తీయనుందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ సిస్టమ్ కు చుక్కలు చూపించేవాళ్లు ఎప్పుడొస్తారో..?






