కాళేశ్వరం ఎండిపోయింది... పంటలు కాలిపోయాయి: కాంగ్రెస్ పై మండి పడ్డ కవిత

by Bhanu |   (  Updated:2025-04-24 12:43:08  IST  )

పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో మోసపోయిన ప్రతి బిడ్డ ఈ సభకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

కాళేశ్వరం ఎండిపోయింది... పంటలు కాలిపోయాయి: కాంగ్రెస్ పై మండి పడ్డ కవిత
X

దిశ, ఎల్కతుర్తి: పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో మోసపోయిన ప్రతి బిడ్డ ఈ సభకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లె సమీపంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ సభ ప్రాంగణాన్ని బీఆర్‌ఎస్ మహిళా నాయకులు, జాగృతి సభ్యులతో కలిసి గురువారం పరిశీలించిన ఆమె, పాత్రికేయులతో మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తూ, రైతుల పంట పొలాలు ఎండిపోయేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. ఈ సభ తెలంగాణ ప్రజలది మాత్రమే కాక, భావితరాలకు దిశానిర్దేశం చేసే సభగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా మిత్రులు కూడా సభకు తప్పకుండా హాజరవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ సందేశాన్ని దేశం మొత్తం వినిపించాలన్నారు.

తెలంగాణ అస్తిత్వం మసకబారుతున్న సమయంలో కేసీఆర్ ప్రజలకు పోరాట స్ఫూర్తిని నేర్పి, మనోధైర్యంతో రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2004లోనే ఏర్పడాల్సిన తెలంగాణను పదేళ్లు ఆలస్యం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించారు. ఈ ఆలస్యం వల్ల వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమ చరిత్రను మరోసారి గుర్తు చేసుకుంటూ, లక్షలాది మందితో 25 వసంతాల పండుగ జరుపుకుందామని పిలుపునిచ్చారు. విద్యార్థినులకు స్కూటర్లు, యువతులకు తులం బంగారం పెళ్లి కానుకగా ఇవ్వాలని చెప్పిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనకు ప్రజలు అసలైన అర్థం చేసుకున్న సమయం వచ్చిందని, ఈసారి మహిళలు పెద్ద ఎత్తున కదలివస్తారని అన్నారు.

మహిళా రిజర్వేషన్ల ద్వారా మార్కెట్ కమిటీల్లో వారికి అవకాశాలు కల్పించామని చెప్పారు. బాల్యవివాహాల నిర్మూలన కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్షగా అభివర్ణించారు.

కాళేశ్వరం ద్వారా రాజకీయ ఆశలేకుండానే రైతు పొలాలకు నీరు అందించాలని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు తప్ప ప్రజలు గుర్తుకు రావని ఎద్దేవా చేశారు.

ప్రకృతి ధర్మంగా పరిణతి చెందడం జరుగుతుందని, ఆ పరిణతిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిందని అన్నారు. ఈ సభ చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయడానికే ఉంటాయని, అలా కాకుండా ప్రజలను మోసం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, నన్నపనేని నరేందర్, చంద్రావతి, సతీష్ బాబు, దాస్యం వినయ్ భాస్కర్, గ్యాదరి బాలమల్లు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, రజిని సాయిచంద్, వాసుదేవ్ రెడ్డి, జాగృతి నాయకులు పాల్గొన్నారు.

Next Story