పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్సే

by Elthuri vijay kumar |

ప్రజల కోసం త్యాగం చేసేది కమ్యూనిస్టులే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్సే
X

పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్సే

ప్రజల కోసం త్యాగం చేసేది కమ్యూనిస్టులే

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

దిశ వరంగల్ బ్యూరో : రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్సేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హనుమకొండలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం చట్టంలోనే మార్పులు అవసరమని సూచించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీబీఐపై నమ్మకం కోల్పోయిన పరిస్థితి నెలకొన్నదని, కేంద్రం ప్రభావం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కమ్యూనిస్టులు నిస్వార్థ పరులు, ప్రజల గుండెల్లో నిలిచే త్యాగమూర్తులని పేర్కొన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల్లో ధనప్రవాహం, మతోన్మాద శక్తుల ఎదుట కూడా ప్రజల కోసం నిలబడి పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం లోని సెక్యులర్, సోషలిజం పదాలను తొలగించే కుట్రలో ఉందని, ఈసీ, సీబీఐ వంటి సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని ఆరోపించారు. ఎర్రజెండా అంటే అలాంటి శక్తులకు భయమని, కమ్యూనిజాన్ని దేశం నుండి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కమ్యూనిస్టులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

ఈ నెల 11–17 వరకు జరగనున్న తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడతారని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సురవరం లేని లోటు ప్రజలకు తీరనిదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నేదునూరి జ్యోతి, టి. వెంకట్రాములు, మేకల రవి, సిరబోయిన కరుణాకర్, వలి ఉల్లా ఖాద్రి, మండ సదాలక్ష్మి, సీపీఎం నాయకుడు ఆరూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story