భద్రకాళి అమ్మవారికి కోటి రూపాయల రథం..

by Bhanu |

ఈనెల 26వ తేదీ గురువారం నుండి ప్రారంభమయ్యే శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు భద్రకాళి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.

భద్రకాళి అమ్మవారికి కోటి రూపాయల రథం..
X

దిశ, వరంగల్ : ఈనెల 26వ తేదీ గురువారం నుండి ప్రారంభమయ్యే శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు భద్రకాళి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఆదివారం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఆలయ పాలకమండలి సమావేశంలో ప్రధాన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా కంచి కామాక్షి అమ్మవారి రథాన్ని అనుసరించి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక రథాన్ని నిర్మించేందుకు తీర్మానం చేశారు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో టేకు చెక్కతో ఈ రథాన్ని తయారు చేయనున్నారు. ఇది జగన్నాథ శాస్త్ర ప్రమాణాల ప్రకారంగా రూపొందించబడనుంది. మాడ వీధుల్లో రథయాత్రలు జరపాలని నిర్ణయించడంతో, అక్కడి నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో రథ సేవలు ఇకపై మాడ వీధిలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ రథ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతుల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లను కలసి మంత్రివర్గం అనుమతులు పొందాలని తీర్మానించారు. అంతేకాకుండా మహోత్సవ కాలంలో ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి జరిగే పూజల అనంతరం ఉచితంగా ప్రసాద వితరణ చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం శాశ్వత నిధిని ఏర్పాటు చేసి, భక్తుల నుండి విరాళాలు స్వీకరించాలని కోరారు.

ఈ సమావేశంలో శాకాంబరీ నవరాత్రి ఉత్సవాలను ఈ నెల 26 నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. సమావేశానికి ధర్మకర్తలు తలుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తోగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి రామేశ్వరరావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగు ఆంజనేయులు, భారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్, ఎక్స్ అఫీషియల్ మెంబర్ పార్నంది నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, దేవస్థాన సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

Next Story