బయ్యారం పీఏసీఎస్ చైర్మన్‌పై అనర్హత వేటు

by Taduka Kalyani |

బయ్యారం మండల రైతు సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ మూల మధుకర్ రెడ్డిపై అనర్హత వేటు పడినట్లు సమాచారం.

బయ్యారం పీఏసీఎస్ చైర్మన్‌పై అనర్హత వేటు
X

దిశ, బయ్యారం: బయ్యారం మండల రైతు సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ మూల మధుకర్ రెడ్డిపై అనర్హత వేటు పడినట్లు సమాచారం. చైర్మన్ పదవికి అవసరమైన భూమి అర్హత లేదంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. కొంతమంది వ్యక్తులు ఆర్టీఏ ద్వారా సమాచారం సేకరించి, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాలతో ఆర్డీఓ విచారణ నిర్వహించి, నివేదికను జిల్లా సహకార సంఘం అధికారి (డీసీఓ) విజయలక్ష్మికి సమర్పించారు. విచారణలో వచ్చిన అంశాలను పరిశీలించిన అనంతరం డీసీఓ ఆదేశాల మేరకు మంగళవారం చైర్మన్ పదవిపై అనర్హత చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం సొసైటీ స్పెషల్ ఆఫీసర్ రమేష్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియను మూడు, నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని, మాజీ చైర్మన్‌కు సంబంధించిన ఇతరత్రా జీత భత్యాలు, బకాయిలను వెంటనే సొసైటీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించినట్లు సమాచారం. అలాగే కార్యాలయంలోని రిజిస్టర్లు, ఇతర రికార్డులను వెంటనే సీఈఓకు అప్పగించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా సహకార సంఘం అధికారి విజయలక్ష్మి వివరణ కోసం ప్రయత్నించగా, ఆమె ఫోన్‌కు స్పందించలేదు.

Next Story