అట్రాసిటీ కేసు అక్రమం..!

by Nallavelli.Anjaneyulu |

అట్రాసిటీ కేసు అక్రమంగా పెట్టారని ఆరోపిస్తూ ఓ గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టిన ఘటన వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

అట్రాసిటీ కేసు అక్రమం..!
X

దిశ, నర్సంపేట : అట్రాసిటీ కేసు అక్రమంగా పెట్టారని ఆరోపిస్తూ ఓ గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టిన ఘటన వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ కి చేరుకున్న జల్లి గ్రామస్తులు అన్యాయంగా కేసు నమోదు చేసినట్లు ఆరోపించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారణ చేయకుండా ఏక పక్షంగా అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ధర్నా చేపట్టారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం... గత నెలలో గ్రామంలో జరిగిన ఓ ఫంక్షన్ కు దొంతరబోయిన కొమ్మాలు అనే వ్యక్తి హాజరయ్యేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడు ఒకరు అతన్ని అడ్డగించి మద్యం మత్తులో గొడవకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

కొమ్మాలు దాడికి గురైనట్లు తెలుసుకున్న అతని ముగ్గురు కుమారులు అక్కడికి చేరుకోవడంతో గొడవ పెద్దది అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎస్సీ యువకుడు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నెల 25న ఆ యువకుడు దొంతరబోయిన కొమ్మాలు సహా అతని కుమారులపై పిర్యాదు చేశాడు. బుధవారం గ్రామానికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారణ చేయలేదని, కొన్ని సాక్ష్యాలు (కర్రలు) సృష్టించినట్లు ఆరోపిస్తున్నారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న వారి వాంగ్మూలం కాకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నట్లు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ కోణంలో అక్రమంగా కేసులు పెడుతున్నట్లు ఆరోపించడం గమనార్హం.

Next Story