‘పుర’ఎన్నికలపై ఆశావహుల చూపు

by Ratna Kumari |

‘పుర’ఎన్నికలపై ఆశావహుల చూపు
X

దిశ, వరంగల్ బ్యూరో : మున్సిపల్ రిజర్వేషన్ల ప్రకటనతో నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. కొన్ని మున్సిపాలిటీల రిజర్వేషన్ల రొటేషన్ తో మారిన ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం రావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ,వామపక్ష పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఆయా పార్టీల సీనియర్ నేతలు మున్సిపల్ చైర్మన్ పీఠాలపై కన్నేసి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ఖర్చు అయినా పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వరంగల్ నగరంతో పాటు 12 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ పాలకవర్గం పదవీకాలం మే నెల వరకు ఉండగా మిగతా 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో 9 పాత మున్సిపాలిటీలు ఉండగా కొత్త గా ఏర్పడిన మూడింటితో కలిపి 12 మున్సిపాలిటీలకు ఈ రిజర్వేషన్లను ప్రకటించారు. రొటేషన్ పద్దతిలో బీసీ,ఎస్సీ,ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను తేల్చారు. గతంలో ఉన్న రిజర్వేషన్లు తారుమారు కాగా కొన్ని రిజర్వేషన్లు జనరల్ కు కేటాయించారు.ఉమ్మడి జిల్లా పరిధిలో గతంలో పరకాల ఎస్సీ మహిళకు కేటాయించగా ఈసారి జనరల్ కు కేటాయించారు. గతంలో వర్ధన్నపేట ఎస్టీ మహిళకు రిజర్వు కాగా.. ఈసారి జనరల్ కు కేటాయించారు. జనగామ జనరల్ మహిళ నుంచి బీసీ జనరల్ గా, మహబూబాబాద్ జనరల్ నుంచి ఎస్టీ మహిళకు, డోర్నకల్ ఎస్టీ నుంచి ఎస్సీ జనరల్ కు, మర్రిపెడ ఎస్టీ మహిళ నుంచి జనరల్ మహిళకు, తొర్రూర్ ఎస్సీ నుంచి జనరల్ కు, భూపాలపల్లి ఎస్సీ మహిళ నుంచి బీసీ జనరల్ కు ఖరారు చేశారు. కొత్తగా ఏర్పడిన స్టేషన్ ఘన్పూర్ ఎస్సీ జనరల్, కే సముద్రం ఎస్సీ మహిళ, ములుగు బీసీ మహిళకు కేటాయించారు. గ్రేటర్ వరంగల్ ను బిసి మహిళా నుంచి జనరల్ కు కేటాయింపు చేశారు.

సీనియర్ నేతలు ప్రయత్నాలు..

ఉమ్మడి జిల్లా పరిధిలో రిజర్వేషన్లు రొటేషన్ పద్దతిన చేపట్టడంతో మున్సిపాలిటీల్లో పోటీదారులు పెరిగారు. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు నజర్ పెట్టి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీలను పరిశీలిస్తే ఈ దఫా ఎన్నికలు జరిగే జనగామ మినహా అన్ని మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో ఆ పార్టీ హవా కొనసాగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే మున్సిపల్ పోరు ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీల టికెట్ కోసం పోటీ కూడా బాగా పెరిగింది.15 రోజుల నుంచి రెండు పార్టీల్లో టికెట్ల కోసం వలసలు కూడా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ధఫా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మున్సిపాలిటీల్లో వార్డుల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీ చేసేందుకు పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. తమకు అనుకూలంగా లేని చోట తమ సతీమణులను కానీ, కుటుంబ సభ్యులను కానీ భరిలోకి దించేందుకు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్ నేతలు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా బీఆర్ఎస్ నేతలు పట్టు కోల్పోకుండా ఉండేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్టిప్ చేసే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అగ్ర నాయకత్వం బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలపైనే పెట్టడంతో పూర్తిస్థాయిలో ఈ ఎన్నికలపైన దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లో వామపక్షా పార్టీల నేతలు కూడా తమకు పట్టున్న మున్సిపాలిటీల పరిధిలో పోటీకి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, మర్రిపెడ, జనగామ మున్సిపాలిటీల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారు. బీజేపీ పార్టీ నుంచి అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సీనియర్ నేతలు అందరూ రంగంలోకి దిగడంతో పాటు అన్ని స్థానాల్లో పోటీకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దఫా ఎంఐఎం కూడా ఉమ్మడి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో పోటీకి సిద్ధమవుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఈ సారి రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది.

Next Story