శంక‌ర్ గౌడ్ భౌతిక కాయాన్ని డిపోకు త‌ర‌లించేందుకు య‌త్నం.. అడ్డుకున్న పోలీసులు

by Ratna Kumari |   (  Updated:2026-04-24 08:51:43  IST  )

న‌ర్సంపేట ఆర్టీసీ డిపోకు శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తరలించే వ‌ర‌కు కదిలేది లేదని భీష్మించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ముత్తోజిపేట గ్రామంలో రోడ్డు పై బైఠాయించారు.

శంక‌ర్ గౌడ్ భౌతిక కాయాన్ని డిపోకు త‌ర‌లించేందుకు య‌త్నం..  అడ్డుకున్న పోలీసులు
X

దిశ వరంగల్ బ్యూరో/ నర్సంపేట : న‌ర్సంపేట ఆర్టీసీ డిపోకు శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తరలించే వ‌ర‌కు కదిలేది లేదని భీష్మించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ముత్తోజిపేట గ్రామంలో రోడ్డు పై బైఠాయించారు. దాదాపు 22 సంవ‌త్స‌రాల పాటు నర్సంపేట ఆర్టీసీ డిపోలో సేవలందించిన శంకర్ గౌడ్ కు ఇదేనా నివాళి అని ప్రశ్నించారు. నర్సంపేట డిపోకు తీసుకెళ్తేనే శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు కోరారు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లితే.. పోలీసులకు అభ్యంతరం ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ కార్మికులు, బీజేపీ శ్రేణులు నిరశన తెలిపారు. పోలీసులు పదేపదే అడ్డుకుని శవపేటికను రోడ్డుపైనే ఉంచడంతోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ పేటిక తీసి శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్న కార్మికులు, బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.

మిట్ట మధ్యాహ్నం మండుటెండలో నడిరోడ్డు పై శంకర్ గౌడ్ భౌతిక కాయంతో రోడ్డు పై బైఠాయించిన మంత్రి బండి సంజయ్ ప్రభుత్వ తీరును విమర్శించారు. పోలీసులు అనవసరంగా అడ్డుకుని ఎందుకు శాంతి భద్రతల‌కు విఘాతం కలిగిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల విజ్ఝప్తి మేరకు ఆర్టీసీ డిపోకు తరలించాలని పోలీసులను కోరారు. ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ ను కడసారిగా చూసి నివాళి అర్పిస్తే నష్టమేంటని పోలీసులను కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిస్థితి వివరించారు. ప్రభుత్వ ఆదేశాలను ఆయనకు తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల, ఆర్టీసీ కార్మికుల విజ్ఝప్తిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నర్సంపేటకు భారీగా జనం, ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తరలించేందుకు అంబులెన్స్ ను రప్పించారు. అంబులెన్స్ లోకి శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తరలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, కుటుంబ సభ్యులు, నర్సంపేట డిపోకు తీసుకువెళ్లేందుకు యత్నించారు. భారీగా పోలీసులు రావడం తో ముత్తోజిపేట లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎట్టకేలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒత్తిడితో ప్రభుత్వం దిగి వచ్చింది. ఆర్టీసీ సంఘాల, కుటుంబ సభ్యుల విజ్ఝప్తి మేరకు నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ భౌతిక కాయంను తరలిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో నర్సంపేట ఆర్టీసీ డిపోకు శంకర్ గౌడ్ భౌతిక కాయం చేరనుంది" అని అనుకుంటుండ‌గానే మ‌ళ్లీ షాక్ త‌గిలింద‌నే చెప్పాలి.

మళ్లీ అడ్డుకున్న పోలీసులు

శంకర్ గౌడ్ డెడ్ బాడీని పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు.డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తరలించే ప్రసక్తే లేదని వారు తెగేసి చేప్పారు. మళ్లీ నడిరోడ్డుపైనే భైఠాయించి ఆర్టీసీ కార్మికులు, బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్దకు వచ్చిన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆయనతో చర్చించారు. పోలీసుల తీరుతో విసిగిపోయిన శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు విసిగిపోయారు. డెడ్ బాడీని మీ దగ్గరే ఉంచుకోండంటూ కేంద్ర మంత్రి వాహనంలోకి కుటుంబ సభ్యులు ఎక్కారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి నర్సంపేటకు వెళ్లేందుకు కేంద్ర మంత్రి పోలీసుల తో చర్చించారు. కనీసం కుటుంబ సభ్యులు డిపోకు వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.

Next Story