ఆ భూములపై సర్వ హక్కులు మావే.. గ్రీవెన్స్‌ సెల్‌లో బాధితుల ఫిర్యాదు

by Kema Shiva Kumar |

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని దౌలత్‌నగర్ గ్రామ పరిసర తండావాసులు గ్రామకంఠం భూమిని కొనుగోలు చేసుకుని ఇల్లు కూడా నిర్మించుకున్నారు.

ఆ భూములపై సర్వ హక్కులు మావే.. గ్రీవెన్స్‌ సెల్‌లో బాధితుల ఫిర్యాదు
X

దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని దౌలత్‌నగర్ గ్రామ పరిసర తండావాసులు గ్రామకంఠం భూమిని కొనుగోలు చేసుకుని ఇల్లు కూడా నిర్మించుకున్నారు. అయితే, ఆ భూమి ప్రభుత్వ భూమి కాదని కోర్టు వెలువరించిన తీర్పును అనుసరించి 1970లో ఖరీదు పూర్వకంగా కొనుగోలు చేసిన చిదురాల ఉపేందర్ కుటుంబ సభ్యులకు గ్రామకంఠం భూమిపై సర్వహక్కులు ఉన్నాయని 2018లో కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, కల్లెడ గ్రామానికి చెందిన సంపెల్లి వెంకటేశ్వరరావు ఆ భూమిని కొనుగోలు చేసి ప్లాట్లు చేయగా సమీప తండావాసులు, ఇతర కులాల వారు కొనుగోలు చేసి ఇల్లు కూడా నిర్మించుకున్నారు.

కానీ, స్థానిక అధికార పార్టీ నాయకులు అది గ్రామకంఠం భూమని.. ప్రభుత్వ భూమి కాబోతోందంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ తమకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని, అదేవిధంగా తమ ప్రభుత్వ అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో బాధితులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లతో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. స్థానిక రాజకీయ నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు చొరవ తీసుకుని తమను బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో భూములు కొన్న స్థానికులు బోడ బాలమ్మ, మాలోతు పటియానాయక్, మాలోతు శ్రీను, సభావత్ సరిత, పసునూరి దినేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story