ఉపాధ్యాయురాలికి బదులుగా పాఠాలు బోధిస్తున్న స్కావెంజర్

by Ratna Kumari |

ఉపాధ్యాయురాలుకి బ‌దులుగా స్కావెంజ‌ర్ పాఠాలు బోధించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఉపాధ్యాయురాలికి బదులుగా పాఠాలు బోధిస్తున్న స్కావెంజర్
X

దిశ, శాయంపేట : మండలంలోని జోగంపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఆందోళన కలిగించే పరిస్థితి వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఏకైక ఉపాధ్యాయురాలు సెలవులో ఉండటంతో విద్యార్థులకు బోధించాల్సిన బాధ్యత సి.ఆర్.పి (CRP)కి అప్పగించాల్సి ఉన్నప్పటికీ, అక్కడ స్కావెంజర్ పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉండగా.. ఉపాధ్యాయురాలు గైర్హాజరు కావడంతో తాత్కాలికంగా ప్రత్యామ్నాయ బోధన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే సీఆర్పీ కూడా అందుబాటులో లేకపోవడంతో స్కావెంజర్ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్‌ సారయ్యను వివరణ కోరగా “ఉపాధ్యాయురాలు సెలవులో ఉన్నారు. సి ఆర్ పి లంచ్‌కు వెళ్లారు” అని సమాధానం ఇచ్చారు. కానీ ప్రైమరీ స్కూల్ లో లంచ్ టైమ్ 12:10 నుండి 01:10 వరకు ఉంటుంది. అయితే అదే సమయంలో పాఠశాలలో బోధన బాధ్యతను అనధికార సిబ్బందిపై వదిలేయడం సరైన చర్యేనా? అనే ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కీలకమైన అంశమై ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story