Warangal Railway Station: వరంగల్‌ రైల్వే స్టేషన్‌ కొత్త లుక్‌.. రైల్వే మంత్రి ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-05-19 12:39:20  IST  )

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

Warangal Railway Station: వరంగల్‌ రైల్వే స్టేషన్‌ కొత్త లుక్‌.. రైల్వే మంత్రి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్లకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్టేషన్ బిల్డింగ్ రూపురేఖలు, వెయిటింగ్ రూమ్స్, టాయిలెట్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైఫై సౌకర్యంతో పాటు చుట్టుపక్కల నగర ప్రాంతాలతో స్టేషన్లను అనుసంధానించే పనులు చేపడుతున్నారు. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలోని (Warangal Railway Station) వరంగల్ రైల్వే స్టేషన్‌లో రూ.25.41 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Railway Minister Ashwini Vaishnav) ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ అమృత్ స్టేషన్ వరంగల్- ఫిబ్రవరి 2024 - శంకుస్థాపన జరిగిందని, మే 2025న అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావోస్తోందని వరంగల్ రైల్వే స్టేషన్ ప్రస్తుత న్యూ లుక్ ఫోటోలను కేంద్ర మంత్రి షేర్ చేశారు.

మరోవైపు రైల్వే మంత్రి ట్వీట్‌ను బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) రీ ట్వీట్ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్‌లో రూ.25.41 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో తలపెట్టిన ఈ పునరుద్ధరణ పనులు ముగింపు దశలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పన, సౌకర్యాలను మెరుగుపరచడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 117 (ఆంధ్రప్రదేశ్ లో 73, తెలంగాణలో 40) రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే.

Next Story