- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: అవమానం గా ఉంది.. క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆవేదన
వరంగల్ కాంగ్రెస్ లో కొండ దంపతులు వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్ తగ్గడం లేదు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అంశంపై కమిటీ చైర్మన్ మల్లురవి చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను కమిటీ ముందుకు తీసుకువచ్చారు. అయితే కమిటీ ముందుకు రావాలంటేనే అవమానకరంగా ఉందని తిట్లు తిన్నది మేము, మళ్లీ మమ్మల్నే క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవడం ద్వారా ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు అని కమిటీని వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇచ్చిన ఫిర్యాదు మీదనే వివరాలు అడిగేందుకే మిమ్మల్ని పిలిచినట్లు మల్లురవి సర్దిచెప్పినట్లు తెలిసింది. అయితే కొండా మురళిపై చర్యలు తీసుకోల్సిందేనని లేదంటే తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని మల్లురవికి తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే అభిప్రాయాలపై మరోకసారి భేటీ అవుతామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెప్పారు. ఈ వ్యవహారంలో కొండా మురళి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు.
కాగా, వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు గుప్పుమంటోంది. కొండా మురళి దంపతులు వర్సెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొండా దంపతుల తీరుపై స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు సైతం ఇటీవల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్ ఎమ్మెల్యేలు మల్లురవిని కలిసి తమ వాదన వివరించారు. ఈ నేపథ్యంలో కొండాపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుపడుతుంటే తన సహకారంతో గెలిచిన వారు తనపైనే విమర్శళు చేస్తున్నారని గతంలో కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ లో ఏం జరగబోతున్నదని సస్పెన్స్ గా మారింది.






