- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5వరకు వేచిచూద్దాం.. నాయిని ఇంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మరో మారు భేటీ
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి.

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుమంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఇటీవల వరంగల్ ఐదుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ దంపతులకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా ఛైర్మన్ వెంకట్రాంరెడ్డిల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌కు, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కొండా మురళీ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నేతలకు బాధ్యతలు అప్పగించింది.
ఈనేపథ్యంలో కొండా మురళి శనివారం గాంధీభవన్‌కు వెళ్లి మల్లురవిని కలిశారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కొండా దంపతుల ప్రభావంపై ఆయన చెప్పుకొచ్చారు. అలాగే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్ రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, వరంగల్ డీసీసీ అధ్యకురాలు ఎర్రబెల్లి స్వర్ణలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, సురేఖ మంత్రి పదవి పోతుందని దుష్ర్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేశారు. అయితే కడియం, రేవూరి, నాయినిలపై ఎందుకు బహిరంగ వేదికలపై విమర్శలు చేయాల్సి వచ్చిందనే విషయానికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఈనేపథ్యంలోనే మల్లురవి మరోమారు కొండా మురళికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ ఐదుగురు ఎమ్మెల్యేల భేటీ
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం పరకాల ఎమ్మెల్యే రేవూరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వంటి నేతలు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో నాయిని ఇంట్లో భేటీ అనంతరం గాంధీ భవన్‌కు వెళ్లి మీనాక్షి నటరాజన్‌కు, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేయగా, తాజాగా జరిగిన భేటీలో క్రమశిక్షణ సంఘం ముందు హాజరైన కొండా మురళి అసలు విషయం చెప్పకుండా దాట వేయడంపై నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. జులై 5 వరకు అధిష్ఠానం తమకు టైం ఇచ్చిన నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని సమావేశంలో నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కొండా దంపతులు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌కు చేసిందేం లేదని, మనపై వారు సవారీ చేయాలని చూస్తున్నారంటూ ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యనించినట్లు సమాచారం. అలాగే తమ నియోజకవర్గం కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టిస్తూ భయ బ్రాంతులకు గురి చేసేందుకు కొండా మురళి ప్రయత్నం చేస్తున్నట్లు మరో ఎమ్మెల్యే సమావేశం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కొండా మురళి కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడని, ఆయన్ను పార్టీలో కొనసాగిస్తే మనమంతా ఆగమవడం తప్పదంటూ ఓ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఏదేమైనా మరో వారం రోజుల పాటు ఆచితూచి వ్యవహరిద్దామని, అధిష్ఠానం ఏం చేస్తుందో చూద్దామని నేతలు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.






