‘మేము కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోండి’.. హైకమాండ్‌కు వరంగల్ కాంగ్రెస్ నేతల అల్టిమేటం?

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-22 09:11:11  IST  )

తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress)లో మరోసారి అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి.

‘మేము కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోండి’.. హైకమాండ్‌కు వరంగల్ కాంగ్రెస్ నేతల అల్టిమేటం?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress)లో మరోసారి అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతలు యుద్ధం ప్రకటించినట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ అనుసరిస్తున్న తీరు.. కొండా మురళి వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం వరంగల్‌లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు ఆఫీస్‌లో భేటీ అయిన నేతలంతా.. ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం కొండా సురేఖ దంపతులపై కంప్లైంట్ చేశారు. కొండా మురళిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయంలో మౌనం వహించొద్దని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. పార్టీకి తాము కావాలో.. కొండా ఫ్యామిలీ కావాలో అధిష్టానమే తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. వారి ఫిర్యాదుపై స్పందించిన మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan).. ఇప్పటికే కొండా మురళి వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని చెప్పినట్లు సమాచారం. విచారణకు సైతం కమిటీ వేయాలని నిర్ణయించినట్లు వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధం లేని నేతలతో పారదర్శకంగా విచారణ చేయిస్తామని వారికి మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీనాక్షిని కలిసిన వారిలో కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యానారయణ, రేవూరి ప్రకాశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story