- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు.. డ్రోన్స్, రోబో వంటి టెక్నాలజీ స్టాళ్లకు అధిక ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షించింది. గురువారం ఉదయం నుంచే సాధారణ ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో సమ్మిట్ ప్రాంగణానికి తరలివచ్చి, ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను సందర్శించారు. సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు డిస్కవర్ తెలంగాణ: కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్-జెన్ టూరిజం అనే అంశంపై జరిగిన అద్భుతమైన సదస్సుతో ప్రారంభమయ్యాయి. వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు తెలంగాణ చరిత్ర, మ్యూజియం సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ఆహార సంస్కృతి వంటి అంశాలపై లోతైన విశ్లేషణలను అందించారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఒక సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను వారు వివరించారు. ఈ సదస్సులో డా. మామిడి హరికృష్ణ, బిరద్ రాజారామ్, పి. పద్మావతి, గోపీ బైల్లుప్పాల వంటి ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం,తెలంగాణ రైజింగ్ ఎంపవరింగ్ ఆల్, గ్రోవింగ్ టుగెదర్ అనే మరో సదస్సులో ప్రముఖులు విద్యార్థులతో సమావేశమయ్యారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
ఆధునిక పరికరాలు, క్రాఫ్ట్స్ స్టాళ్లకు ప్రత్యేక ఆకర్షణ..
సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 27కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా, ఏరోస్పేస్, మూసీ రివర్ డెవలప్‌మెంట్, సైబర్ క్రైమ్ నిరోధంలో ఉపయోగించే పలు అధునాతన పరికరాలు, డ్రోన్స్, రోబో వంటి టెక్నాలజీ స్టాళ్లకు అధిక ప్రాధాన్యత దక్కింది. సందర్శకులు ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. హాండీక్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రీ, చేర్యాల పెయింటింగ్స్ వంటి సాంస్కృతిక స్టాళ్లు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.పు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ గ్లోబల్ సదస్సును సందర్శించవచ్చని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.






