అగ్రిస్టాక్‌తో రైతుల "విశిష్ట" గుర్తింపు: నమోదు షురూ

by Naga Rani Yarlagadda |

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు పొందాలంటే రైతులకు ఇక నుంచి ఖచ్చితంగా విశిష్ట గుర్తింపు కార్డు ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన ఐడీ నంబర్‌ ప్రతి ఫార్మర్‌కు ఉండాలని కేంద్రం ఆదేశించింది.

అగ్రిస్టాక్‌తో రైతుల విశిష్ట గుర్తింపు: నమోదు షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు పొందాలంటే రైతులకు ఇక నుంచి ఖచ్చితంగా విశిష్ట గుర్తింపు కార్డు ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన ఐడీ నంబర్‌ ప్రతి ఫార్మర్‌కు ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు మూడు రోజుల నుంచి రైతుల వివరాలు నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు.

కార్డు ఉంటేనే పథకాలు

రైతుల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, ఉద్యాన వన శాఖ ద్వారా పండ్లు, కూరగాయలు, పట్టు పెంపకం దారులకు 60 శాతం రాయితీ అందిస్తున్నది. ఇవే కాకుండా మరికొన్ని స్కీమ్స్ ప్రవేశ పెట్టేందుకు ప్లాన్​చేస్తున్నది. అయితే కొత్తగా ప్రవేశ పెట్టిన విశిష్ట గుర్తింపు కార్డు ఉంటేనే రైతులకు ఆయా పథకాలు అందుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన సరైన గణాంకాలు, ధృవీకరణాలు, నమోదు వివరాలు లేక అనేక మందికి పథకాలు సరిగా అందడం లేదని కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రాల్లోని భూములు, పంటల వివరాలు మాత్రమే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంటల వివరాలతో పాటు ఇతరత్రా సమాచారం కేంద్రం వద్ద లేదు. వీటన్నింటికీ పరిష్కారం విశిష్ట గుర్తింపు సంఖ్యతో వస్తుందని, అందుకే ప్రతి రైతుకూ ప్రత్యేక కార్డు జారీ చేయాలని మోడీ సర్కారు నిర్ణయించింది.

మూడు రోజుల క్రితం ప్రారంభం

ప్రతి రైతుకూ ఆధార తరహాలో 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయిస్తారు. దీనికి సంబంధించి మూడు రోజుల నుంచే రైతు వివరాల నమోదు ప్రాజెక్టు ప్రారంభమైంది. మొదటగా రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నెల రోజుల తర్వాత మీసేవ కేంద్రాల్లో ఎంటర్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆధార్​సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాసుపుస్తకంలోని భూయాజమాన్య వివరాల నమోదు ఆధారంగా రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు.

19 రాష్ట్రాల్లో నమోదు

ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో విశిష్ట గుర్తింపు కార్డు కోసం నమోదు ప్రక్రియ పూర్తి చేసి కేంద్రానికి వివరాలు అందించాయి. కొన్ని కారణాలతో తెలంగాణలో వాయిదా పడింది. ప్రస్తుతం రేవంత్​ప్రభుత్వం అగ్రిస్టాక్​తెలంగాణ ఫార్మర్​రిజిస్ట్రీ పేరుతో అమలు చేయాలని నిర్ణయించింది. నెల రోజుల క్రితం మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు రైతుల వివరాల నమోదు ప్రక్రియకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. రాష్ట్ర వ్యవసాయ అధికారులు వివరాల ప్రకారం విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూయాజమాన్య పట్టాదారు పాస్​పుస్తకం, ఆధార్, ఫోన్​నంబర్‌తో ఏఈవో వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు ఎంటర్ చేయగానే ఫోన్‌కు ఓటీపీ నంబర్ వస్తుంది. ధృవీకరణ చేసి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ నంబర్‌ను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. వానాకాలం సీజన్‌కు సంబంధించిన పీఎం కిసాన్​రూ.2 వేలను ఈ కార్డు ఆధారంగానే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం డిసైడ్ చేసింది.

‘విశిష్ట’ ఐడీతో ఉపయోగాలు

విశిష్ట గుర్తింపు ద్వారా కేంద్ర పథకాలు సక్రమంగా అందుతాయి. ఆకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల సమయంలో ఐడీ నంబర్ నమోదు చేస్తే రైతు పంట సాగు చేసిన పూర్తి వివరాలు తెలుస్తాయి. విపత్తులు సంభవించినప్పుడల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రాష్ట్రంలో 70 లక్షలకు పైగా పట్టాదారు పాస్​బుక్​కలిగిన రైతులుండగా అందులో 31.85 లక్షల మంది పీఎం కిసాన్​స్కీమ్‌కు అర్హులుగా ఉన్నారు.

రాష్ట్ర పథకాలకు అవసరం లేదు

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా, రుణమాఫీ వంటి స్కీమ్స్‌కు.. విశిష్ట కార్డుతో సంబంధం లేదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి రైతూ విశిష్ట కార్డు కోసం తమ వివరాలను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలని సూచించారు.

Next Story