- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు 'విజన్ 2047' డాక్యుమెంట్
రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం లక్ష్యంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఒక సమగ్రమైన 'విజన్ 2047' డాక్యుమెంట్‌ను రూపొందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం లక్ష్యంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఒక సమగ్రమైన 'విజన్ 2047' డాక్యుమెంట్‌ను రూపొందించింది. ఈ డాక్యుమెంట్ ను డిసెంబర్‌లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్లో ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను, నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడం ఈ డాక్యుమెంట్ ప్రధాన ఉద్దేశమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి చెబుతున్నారు. విద్యా సంస్థలలో నాణ్యతను, వసతులను పెంచడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. నేడు కొత్తగూడెంలో జరగనున్న మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ ప్రారంభానికి 8 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరందరికి ఆయా అంశాలపై దిశానిర్థేశం చేయనున్నారు.
టెక్నికల్ కోర్సుల రూపకల్పన
అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు ప్రస్తుత పారిశ్రామిక అవసరాలను తీర్చే విధంగా కొత్త టెక్నికల్ కోర్సులను రూపొందించనున్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా బోధనా సిబ్బందికి నిరంతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని డాక్యుమెంట్‌లో ప్రతిపాదించారు. దీనివల్ల అధ్యాపకులు తమ బోధనను ఆధునిక పద్ధతుల్లో మెరుగుపరచుకోగలుగుతారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నిష్ణాతులైన వృత్తి నిపుణులను శిక్షణకు, బోధనకు ఉపయోగించుకునే చర్యలను వేగవంతం చేయనున్నారు. తద్వారా విద్యార్థులకు వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రయివేటు భాగస్వామ్యం
విద్యా రంగం ప్రమాణాలు మెరుగు పరచడానికి 2047 నాటికి రూ. లక్షకోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం ద్వారా నిధుల సేకరణ సులభతరం అవుతుందని భావిస్తున్నారు. నిధులను ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎడ్యుకేషన్, అధ్యాపక శిక్షణ, పరిశోధన ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యాలను విస్తరించేందుకు వినియోగించనున్నారు. దీనివల్ల ఉన్నత విద్యలో సగటు ప్రవేశాల శాతం 70 శాతానికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీకి 500 ఎకరాలు కేటాయించేలా డాక్యుమెంట్ రూపొందించారు. అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు, ఆవిష్కరణల హబ్‌లు, ఎడ్యుటెక్ కంపెనీలు, స్టార్టప్ యాక్సిలరేటర్లు అన్నీ ఒకే క్యాంపస్ లో ఉండేలా చూడాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ 'విజన్ 2047' డాక్యుమెంట్ ఉన్నత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా, రాష్ట్ర యువతను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై చర్చించి, కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.






