భద్రాద్రి కల్యాణానికి ఎందుకు వెళ్లలేదు.. కేసీఆర్‌కు హిందువులంటే లెక్కలేదా?

by Disha Web Desk 2 |
భద్రాద్రి కల్యాణానికి ఎందుకు వెళ్లలేదు.. కేసీఆర్‌కు హిందువులంటే లెక్కలేదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని, ఆయనకు హిందూ దేవుళ్లంటే ఎందుకంట వివక్ష అని విశ్వహిందూ పరిషత్ నేతలు ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015, 16లో అధికారికంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్.. ఇప్పటివరకు మళ్లీ భద్రాచలం ముఖం చూడకపోవడం దారుణమని వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి, అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్ గురువారం ఒక ప్రకటనలో ఫైరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీతారామ చంద్రుల పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతోందని, 12 ఏండ్లకోసారి నిర్వహించే వేడుకకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పుష్కర సామ్రాజ్య మహోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిధులు కేటాయించకపోవడం రాములవారిని అవమానించడమేనన్నారు.

చివరి నిమిషంలో వేడుకకు ముందురోజు రూ.కోటి కేటాయిస్తున్నట్లు ప్రకటిస్తే ఏర్పాట్లు చేసుకునేది ఎలా అని వారు ప్రశ్నించారు. కళ్యాణ మహోత్సవానికి రూ.2.25 కోట్లు ఖర్చు వస్తే కేవలం రూ.కోటి ప్రకటిస్తున్నట్లు చెప్పడంపై వారు ధ్వజమెత్తారు. ఆ కోటి కూడా మంజూరు చేశారా? లేదా అనేదిఅనుమానంగానే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ముత్యాల తలంబ్రాలకు రూ.లక్ష కూడా ఖజానా నుంచి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని వారు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రంజాన్, క్రిస్మస్ తోఫా అంటూ ఇతర మతస్తులకు కోట్లు కోట్లు ఖర్చు చేస్తూ రాముడి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు కూడా నిధులు కేటాయించలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకులు నేటికీ హుండీపైనే ఆధారపడే దుస్థితి ఏర్పడిందన్నారు. పనిగట్టుకొని హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, వచ్చే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీతారాముల కళ్యాణానికి సీఎం వెళ్లకపోవడంపై హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed