విప్స్ చెప్పింది ‘వడ్డీ’.. ఇచ్చింది ‘బడ్డి’..! కోటి రూపాయలు స్వాహా..!

by Bhanu |   (  Updated:2025-07-10 06:51:38  IST  )

అధిక వడ్డీ ఆశ చూపి గ్రామీణ ప్రాంతాల్లోని అమాయకుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు

విప్స్ చెప్పింది ‘వడ్డీ’.. ఇచ్చింది ‘బడ్డి’..! కోటి రూపాయలు స్వాహా..!
X

దిశ, నల్లగొండ బ్యూరో: అధిక వడ్డీ ఆశ చూపి గ్రామీణ ప్రాంతాల్లోని అమాయకుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు చేతులెత్తేసినట్లైంది. ఆన్లైన్ ద్వారా ఈ సంస్థ పెట్టుబడి పెడితే నెలకు మూడు శాతం వడ్డీ ఇస్తామంటూ చెప్పడంతో అనేక మంది ఉద్యోగులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ కొంతకాలంగా వడ్డీ రావడం లేదని, అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏజెంట్ల ద్వారా సొంతంగా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినవారు, వడ్డీ కట్టలేక ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామీణ రైతులు పలువురు మోసపోయినట్లు తెలుస్తోంది.

నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

నాంపల్లి మండలంలోని ఎట్లా మల్లేపల్లిలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు గాదెపాక సైదులు, అదే మండలానికి చెందిన అన్నెపాక బాలరాజు వద్ద 2023లో రూ.10 లక్షలు అప్పుగా తీసుకుని, ఏడాదిలో తిరిగి చెల్లిస్తానని ప్రామిసరీ నోట్ ఇచ్చారు. అయితే అడిగినా డబ్బు ఇవ్వకపోవడంతో బాలరాజు జూన్ 26న నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సైదులు తెలిపిన వివరాల ప్రకారం, తాను తీసుకున్న డబ్బును విప్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టానని, అది రావాల్సిందేనని చెబుతున్నారు.

నాంపల్లిలో కోటి రూపాయల మోసం.?

విప్స్ సంస్థ తరఫున ఏజెంట్లు నాంపల్లి మండలంలోనే దాదాపు కోటి రూపాయల పెట్టుబడి వసూలు చేసినట్లు సమాచారం. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి రూ.5 లక్షలు, విద్యుత్ శాఖ ఉద్యోగి నుంచి రూ.10 లక్షలు, గట్ల మల్లేపల్లి వ్యక్తి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటివరకు 1 కోట్లకు పైగా నిధులు మాయం అయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.


Next Story