అప్పుల ఊబిలో విజయ డెయిరీ.. రూ.200 కోట్ల నష్టాలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలు సరఫరా చేస్తున్న విజయ డెయిరీ గత పాలకుల నిర్లక్ష్యంతో రూ. 200 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది.

అప్పుల ఊబిలో విజయ డెయిరీ.. రూ.200 కోట్ల నష్టాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలు సరఫరా చేస్తున్న విజయ డెయిరీ గత పాలకుల నిర్లక్ష్యంతో రూ. 200 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. అప్పుల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గత రెండు నెలల క్రితం రూ.50 కోట్లు విడుదల చేయగా తాజాగా మరో రూ.50 కోట్లు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. విజయ డెయిరీకి పాలు విక్రయిస్తున్న పాడిరైతులకు మూడు నెలలుగా బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. గత నెలలో రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట వంటి జిల్లాల్లో రైతులు బకాయిలు ఇవ్వాలని ఆందోళన చేయడంతో కొంత నగదు విడుదల చేసి రైతులకు చెల్లించింది. ఇంకా బకాయిలు ఉండటంతో మరో రూ.50 కోట్లు విడుదలకు సిద్దమైంది.

విజయ డెయిరీలో పనిచేసే కొందరు ఉద్యోగులు ప్రైవేటు డెయిరీ యాజమాన్యాలతో కుమ్మకై వారి నుంచి ముడుపులు తీసుకుంటూ విజయ డెయిరీ ఉత్పత్తులపై ఫోకస్ తగ్గించారు. లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటూ సంస్థ నిర్వహణను నిర్లక్ష్యం చేయడంతో పాల సేకరణ తగ్గేలా చేసి రైతులకు సకాలంలో బిల్లు చెల్లించకుండా కుట్రలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయ డెయిరీ లీటరు పాలు రూ.58లకు సరఫరా చేస్తుండగా కల్తీగాళ్లు అదే బ్రాండ్ పేరుతో రూ. 50లకే సరఫరా చేస్తూ ఏజెంట్లకు లీటర్ పాలపై రూ. 8 వరకు కమిషన్ ముట్టజెప్పుతున్నారు. దీంతో ఆసలైన విజయ డెయిరీ పాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోవడంతో సంస్థ నష్టాల బాట పట్టింది. గతంలో విజయ డెయిరీ రోజుకు 4.50 లక్షల లీటర్లు సేకరించగా ప్రస్తుతం 3.50 లక్షల లీటర్లకు తగ్గింది.

సంస్థ నష్టాల్లో ఉన్నా.. అధికారుల విలాసాలు..

విజయ డెయిరీ నష్టాలో ఉన్నా అధికారులు మాత్రం విలాసాలు చేస్తూ ఖరీదైన కార్లు, రైతులతో సమావేశం నిర్వహించి పెద్దమొత్తంలో ఖర్చు చేసినట్లు సమాచారం. కార్యాలయ అవసరాలకు వినియోగించాల్సిన కార్లను సొంత అవసరాలకు వాడుకుని అధిక మొత్తంలో బిల్లులు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

మార్కెట్లో కల్తీ బ్రాండ్లు..

కర్నూలు జిల్లా సహకార సంఘం వీఏన్ డెయిరీ ప్రొడక్టు ప్రైవేటు లిమిటెడ్, కృష్ణా జిల్లా పాల ఉత్పత్తి పరస్పర సహాయ సహకారం సంఘం , శ్రీసాయి దుర్గ ఎంటర్ప్రైజెస్, నెల్లూరు జిల్లా పరస్పర సహాయ సహకార పాల ఉత్పత్తి యూనియన్లిమిటెడ్, ఆల్రిచ్ డెయిరీ ప్రైవేటు లిమిటెడ్, ఎన్ఎస్ఆర్ డెయిరీ వంటి ఉత్పత్తులతో పాటు నార్మల్ డెయిరీ వంటి సంస్థలు విజయ బ్రాండ్ ను వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రైవేటు డెయిరీల అరాచకాలకు అడ్డుకట్ట

రాష్ట్రంలో విజయ డెయిరీ పేరుతో నకిలీ పాల ఉత్పత్తులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. అందుకోసం వ్యవసాయ కమిషన్ కు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇటీవల కమిషన్ సభ్యులు సమావేశం నిర్వహించి ప్రైవేటు సంస్థకు కొమ్ముకాసే అధికారులను గుర్తించి వారి భరతం పట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలిస్తోంది. అదే విధంగా గత ప్రభుత్వంలో 200 మంది ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయగా, వారిని ఏ ప్రాతిపదికన నియామకాలు చేపట్టారో వంటి అంశాలను బయటకు తీయనున్నారు. ఆసంస్థలో జరుగుతున్న అవినీతి బాగోతం బయటపెట్టేందుకు వ్యవసాయ కమిషన్ జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది.

Next Story