- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రంగనాయక సాగర్‌పై విజిలెన్స్ ఫోకస్.. గజ్వేల్ సీఈకి విజిలెన్స్ ఎస్పీ లేఖ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. Kaleshwaram Project, Ranganayaka Sagar Reservoir, Vigilance Investigation, Gajwel, Telangana

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రిజర్వాయర్ నిర్మాణంపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందులాపూర్ వద్ద మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ప్రాజెక్టులో కీలకంగా మారింది. అయితే.. ఈ రిజర్వాయర్ నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలలో అక్రమాలున్నాయన్న ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నెల 4న విజిలెన్స్ ఎస్పీ శృతకీర్తి, కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ (గజ్వేల్)కు లేఖ పంపించి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సమర్పించాలని ఆదేశించారు. ఇందులో సర్వే నివేదికలు, డీపీఆర్, ఫీజిబిలిటీ స్టడీలు, అంచనాలు, ఒప్పందాల అనుమతులు వంటి పలు అంశాలపై పూర్తి వివరాలు కోరారు.
మట్టి కట్ట నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్, జియోలాజికల్ నివేదికలు, నీటి లభ్యత అంచనాలు, ప్రాజెక్టు అసలు ఎలైన్‌మెంట్ మరియు మార్పుల వివరాలు కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, అటవీ భూముల మళ్లింపు, బాధితులకు చెల్లించిన పరిహారం, హైపవర్ కమిటీ మరియు స్టేట్ లెవెల్ కమిటీల సమావేశాల మినిట్స్‌ను కూడా అందించాలని సూచించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు జరిగిన సమీక్షా నివేదికలు, అధికారుల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ సమర్పించాలని గడువు విధించినట్లు సమాచారం. ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు అవసరమైన రికార్డులను విజిలెన్స్ కార్యాలయానికి అందజేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, అలాగే మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మకు నీటిమార్పిడి పనులపై విచారణ కొనసాగుతుండగా.. ఇప్పుడు రంగనాయక సాగర్‌ను కూడా పరిశీలనలోకి తీసుకోవడం ప్రాజెక్టు మొత్తం అమలుపై మరింత దృష్టి పెట్టినట్లు సూచిస్తోంది. విజిలెన్స్ దర్యాప్తు పూర్తయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో పారదర్శకత, బాధ్యతకు సంబంధించిన కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది.






