ఇసుక అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు.. 1875 మెట్రిక్ టన్నుల ఇసుక, 13 వాహనాలు సీజ్, 7 గురు అరెస్ట్

by Ramesh Naini |

ఇసుక అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రెండు రోజుల పాటు మూడు జిల్లాలలో ఆకస్మిక దాడులు చేపట్టినట్లు విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ మంగళవారం తెలిపారు.

ఇసుక అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు.. 1875 మెట్రిక్ టన్నుల ఇసుక, 13 వాహనాలు సీజ్, 7 గురు అరెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇసుక అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రెండు రోజుల పాటు మూడు జిల్లాలలో ఆకస్మిక దాడులు చేపట్టినట్లు విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్ సిటీ-2 యూనిట్, వరంగల్ యూనిట్ విజిలెన్స్ బృందాలు నారాయణ పేట మండలం మరికల్ మండలం రాకొండ గ్రామం, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గురుకొండ గ్రామం, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై సోమ, మంగళవారాల్లో దాడులు నిర్వహించారు. ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఊక చెట్టు వాగు (కోయిల్‌సాగర్ ప్రాంతం), ఖమ్మం జిల్లా మున్నేరు వాగులలో జరుగుతున్నట్లు గుర్తించారు.

సుమారు 1,875 మెట్రిక్ టన్నుల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ డీజీ తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేయడానికి ఉపయోగిస్తున్న 4 ఎక్స్‌క వేటర్లు, 2 టిప్పర్లు 7 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పేర్కోన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ఫిర్యాదు మేరకు నారాయణపేటలోని మరికల్ పోలీస్ స్టేషన్, మహబూబ్‌ నగర్‌లోని దేవరకద్ర పోలీస్ స్టేషన్, ఖమ్మంలోని ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 13 మంది వ్యక్తులను నిందితులుగా గుర్తించగా, వారిలో 7 గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. బీఎన్ఎస్, మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ చట్టం కింద ఈ కేసులు నమోదు చేసినట్లు డీజీ శిఖా గోయల్ తెలిపారు.

Next Story