- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజిలెన్స్ ఎంక్వైరీ షురూ.. మార్కెటింగ్ శాఖ అధికారుల్లో టెర్రర్
పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్ విచారణతో మార్కెటింగ్ శాఖ అధికారుల్లో వణుకు మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్ విచారణతో మార్కెటింగ్ శాఖ అధికారుల్లో వణుకు మొదలైంది. విచారణలో దళారులకు అదికారులు సహకరించి కమీషన్లు తీసుకున్నట్లు తేలడంతో ఏ క్షణంలోనైనా తమపై వేటు పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తూ వేటు పడకుండా చూడాలని, అవసరమైతే ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయాలని వేడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పత్తి సేకరణ అక్రమాలపై ఇప్పటికే విపక్ష పార్టీ నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులతో పాటు, ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐదు నెలల క్రితం పత్తి కొనుగోళ్ల బాగోతంపై వరంగల్ వ్యవసాయ మార్కెట్, జనగామ, చిన్నకోడూరు, చెన్నూర్, భద్రాచలం, పెద్దపల్లి, ఆదిలాబాద్ కు చెందిన ఏడుగురు మార్కెటింగ్ కార్యదర్శులు సస్పెండ్కాగా మరో 120 మంది కింది స్థాయి సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. అయితే వ్యవహారం ఇంతటితో ఆగిపోతుందని అధికారులు, నేతలు భావించినప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని పట్టుబట్టడంతో గత నెల 25న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది.
టీఆర్ పత్రాలే దళారులకు వరం..
సీసీఐ కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయించాలంటే ముందుగా ఆయా మండలాల వ్యవసాయాధికారుల వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలి. అందుకు పట్టా పాస్బుక్, ఆధార్కార్డు తీసుకెళ్లి ఎన్ని ఎకరాల సాగు, ఎంత దిగుబడి వస్తుందనే విషయాలు తెలపాలి.. దీనిని ఏఈవో ధ్రువీకరించి రిజిస్ట్రేషన్ చేస్తారు. అనంతరం మార్కెట్కు తీసుకెళ్లితే సీసీఐ అధికారులు తూకం వేస్తారు. కానీ ఈ విషయం తెలియని రైతులు నేరుగా సీసీఐ కేంద్రాలకు పత్తి తరలిస్తున్నారు. దీంతో రైతులకు మార్కెటింగ్ సెక్రటరీలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేస్తారు. ఇక్కడే దళారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇదే అదునుగా భావించే దళారులు నాలుగు నెలల పాటు పత్తి వ్యాపారంలో అందిన కాడికి దండుకుని రైతులను నిలువునా ముంచారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
రైతుల వద్ద రూ.5,500లకే కొనుగోలు..
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులు సుమారుగా 66.50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 49 లక్షల పత్తి బేళ్లు దిగుబడి వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో సీసీఐ 41 లక్షల బేళ్లు కొనుగోలు చేయగా మిగతా 8 లక్షల బేళ్లు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.7521 ప్రకటించగా టీఆర్ ఉన్న దళారులు రూ.5500 నుంచి రూ.6100 వరకు రైతుల నుంచి కొనుగోలు చేసి వారు రూ. 7500లకు సీసీఐకి విక్రయించారు. రైతుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కొంతమంది అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ రాజకీయ చతురతతో రైతులు తమ పత్తి పంటను దళారులకు అమ్మేలా వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అసలే అప్పుల బాధలో ఉన్న అన్నదాతలు వెంటనే నగదు చేతిలో పడుతుంటనే ఆశతో తక్కువ రేటుకైనా అమ్మకాలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన పత్తిని దళారులు సీసీఐ కేంద్రాల్లో టీఆర్లతో దర్జాగా అమ్మారు. దీంతో వారికి క్వింటాల్ రూ.2వేలకు పైగా లాభం వచ్చింది. ఈ లాభాల వాటాలో మార్కెటింగ్శాఖ అధికారులు, తూకం వేసే సిబ్బంది పంచుకున్నట్లు విచారణలో బయటపడింది.
అధికార, ప్రతిపక్ష నేతల హస్తం..
పత్తి సేకరణ అక్రమాల్లో అధికార కాంగ్రెస్ నేతలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల హస్తం కూడా ఉన్నట్లు విజిలెన్స్విచారణలో బయటపడినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో అనుభవం ఉండటంతో కాంగ్రెస్ నేతలను అడ్డం పెట్టుకుని దర్జాగా దందా సాగించినట్లు, కొన్నిచోట్ల పత్తి దందా బాగా సాగడంతో ప్రతిపక్ష నేతలంతా అధికార పార్టీలో చేరి భారీగా సంపాదన పోగేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పత్తి సేకరణలో జరిగిన గోల్మాల్ వ్యవహారం ఇరు పార్టీల నేతల మెడకు చుట్టుకోక తప్పదని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.






