- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబోయే 72 గంటల్లో అతి భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. శుక్రవారం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలయమయమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. శుక్రవారం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలయమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కూడళ్లు చెరువులు, కుంటలను తలపించాయి. పలుచోట్ల ట్రాఫిక్ (Traffic)కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలాచోట్ల మోకాలి లోతు వరద నీరు ప్రవహించింది. ప్రజలు గంటల కొద్దీ మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకుల వద్ద తలదాచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక పలు కాలనీల్లో చెట్టు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (India Meteorological Department) కీలక ప్రకటన చేసింది. రాబోయే మరో 72 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉండటంతో రానున్న నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
అయితే, రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన సామగ్రి ముందుగానే సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. చెట్లు విరిగి రోడ్లపై పడితే తక్షణమే తొలగించాలని, ఎక్కడా వరద నీరు నిలిచిపోకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.






