- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చుక్కలనంటిన కూరగాయల ధరలు.. సామాన్యుల జేబుకు చిల్లు
తెలంగాణలో వర్షాభావం, ఎండల ప్రభావంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కూరగాయలు కొనేందుకు సామాన్య ప్రజలు జంకుతున్నారు.

దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కూరగాయల ధరలు భగభగ మండిపోతున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఎండలు, తాజాగా వర్షాభావ పరిస్థితులు వల్ల కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. జూన్ నెలాఖరు వచ్చినా ఈసారి వానల జాడ లేకపోవడంతో కూరగాయల సాగు భారీగా తగ్గిపోయింది. దీనికి తోడు ఎండలు, పెరిగిన ఇంధన ధరలు, ఎల్‍నినో ప్రభావం వెరిసి కూరగాయల రేట్లు పట్టపగలే సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. బీన్స్, చిక్కుడు, బీరగాయ, పచ్చి మిర్చి, దొండకాయ, వంకాయ ఇలా అన్ని కూరగాయల రేట్లు రెట్టింపు కాగా పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతి కూర తదితర ఆకుకూరలు బోరు మోటార్ల నుంచి నీరు అందక ఎండిపోతున్నాయని అంటున్నారు. దీంతో ఆకు కూరలు మార్కెట్ రాక ధరలు పెరిగాయని విక్రయదారులు చెబుతున్నారు.
భారీగా తగ్గిన ఉత్పత్తి:
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం, సాగు నీటి వసతి, ఇతర కారణాల వల్ల కూరగాయలను పండించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కూరగాయల సాగుభారీగా పడిపోయింది. రైతు బజార్లలో సరుకు లేకపోవడంతో విక్రయదారులు సైతం మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాల్లోని వ్యాపారులు హైదరాబాద్,కర్నూల్ వంటి ప్రాంతాల నుంచి సరుకు తెప్పించుకుని విక్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో దళారులు ధరలు పెంచేశారు. వారి నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు సైతం ధరలను మరింత పెంచడంతో వినియోగదారులకు పెను భారం పడుతోంది. దీంతో బీన్స్ రైతు బజార్‍లో కేజీ రూ. 100 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతుండగా చిక్కుడుకాయ కూడా రైతు బజార్‍లో రూ.70 నుంచి రూ.80 ఉండగా, బయట మార్కెట్‌లో రూ.150 వరకూ అమ్ముడవుతోంది. మిర్చి కిలో రూ.80కి చేరింది. దీంతో కూరగాయల భోజనం చేయాలంటే సామాన్యుల బడ్జెట్‍కు చిల్లు పడుతోంది.






