- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర ఆలయంలో భారీ చోరీ!.. వైరల్ అవుతోన్న చీకోటి ప్రవీణ్ ఆడియో
తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర భద్రతా వైఫల్యం బయటపడింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర భద్రతా వైఫల్యం బయటపడింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు భారీ చోరికి పాల్పడ్డారు. నిరంతరం భద్రతా సిబ్బంది, సీసీటీవీల నిఘా ఉండే ఇంతటి భారీ క్షేత్రంలో దొంగతనం జరగడం స్థానికంగా, భక్తులలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణంలోని పైఅంతస్తులో కొలువై ఉన్న ఉపాలయం.. మహంకాళి అమ్మవారి సన్నిధిని దొంగలు టార్గెట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో మహంకాళి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, గర్భాలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని అపహరించారు. దాంతో పాటు అక్కడే ఉన్న కానుకల హుండీని కూడా ఎత్తుకెళ్లారు. అనంతరం హుండీలోని నగదు మొత్తాన్ని కాజేసి, ఖాళీ హుండీని సమీపంలోని వ్యాసగుడి వద్ద పడేసి పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, నిత్య పూజల కోసం ఆలయానికి చేరుకున్న అర్చకులు, తలుపులు విరగ్గొట్టి ఉండటం గమనించి వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సీసీటీవీల ఆధారంగా పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న నిర్మల్ జిల్లా పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలు సేకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించగా, దుండగులు లోపలికి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఆలయ ఈవోను నిలదీసిన బీజేపీ నేత చీకోటి ప్రవీణ్
ఈ చోరీ ఘటనపై హిందూ సంఘాలు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ఈ ఘటనపై తక్షణమే స్పందిస్తూ, బాసర ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (EO)కు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో నిలదీశారు. "ఆలయంలో రాత్రి వేళల్లో ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీలో ఉన్నారని చెబుతున్నారు.. మరి అంతమంది సిబ్బంది ఉండి కూడా దొంగతనం ఎలా జరిగింది? సిబ్బంది ఏం చేస్తున్నారు? అని చీకోట్ ప్రవీణ్ ప్రశ్నించారు. ఆలయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వరుసగా హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు. చోరీలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






