- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూరగాయల సాగుకు ప్రోత్సహించాలి : మంత్రి తుమ్మల
కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన కూరగాయల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన కూరగాయల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేసి, డిప్యూటి డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు జిల్లాలు కేటాయించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని, కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఉద్యన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలలో పెద్ద ఎత్తున కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా డిమాండుకు అనుకూలంగా కూరగాయల సాగును రైతులకు అందించాలని సూచించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పురోగతి చాలా మందకోడిగా నడుస్తున్నదని, వారం వారీగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, జిల్లాలు, కంపెనీల వారిగా పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్న జాయింట్ డైరెక్టర్లు ఒక్కొక్కరికి 5 జిల్లాలు కేటాయించాలని, వారంలో మూడు రోజులు వారు ఆయా జిల్లాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పెంచడానికి, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏర్పాటు చేయాలన్నారు. ఆయిల్ పామ్ నర్సరీలలో ఎట్టి పరిస్థితులలో కూడా కల్లింగ్ మొక్కలు ఉండకూడదని, ఆయిల్ పామ్ రైతులకు ఆరోగ్యకరమైన, మంచి మొక్కలను అందించాలన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఉద్యాన పంటలకు ప్రోత్సకాలు అందిస్తున్నాం : ఉద్యాన శాఖ డైరెక్టర్
రాష్ట్రంలో 12.96 లక్షలో ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని, 42.58 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాగించడం జరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్భాషా తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున తుంపర, సేద్య పరికరాలపై రాయితీ ఇస్తుందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం , చిన్న, సన్నకారు, బిసి రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 29,821 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 81,942 ఎకరాల విస్తీర్ణంలో బిందు, తుంపర సేద్య పరికరాలను అందించడం జరిగిందని, 2025-26 సంవత్సరానికి 51,328 ఎకరాల విస్తీర్ణానికి పరిపాలన అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు.
2025-26 సంవత్సరానికి సంబంధించి 1,25,000 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఇప్పటికే 18 వేల మంది రైతులు 66 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ నాటుటకు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. 26 వేల ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో జూన్ నెల నాటికి 6750 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.






