వన మహోత్సవం పండుగలా నిర్వహించాలి : మంత్రి కొండా సురేఖ

by Muthe.Rajitha |

వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ విస్తరణ, భూ భారతి, సీజనల్ వ్యాధులు , టిబి ముక్త్ భారత్, వైద్య కళాశాలల అవసరాలు మొదలైన వాటి పురోగతి నిరంతరాయంగా జరుగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ల ఆదేశించారు.

వన మహోత్సవం పండుగలా నిర్వహించాలి : మంత్రి కొండా సురేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ విస్తరణ, భూ భారతి, సీజనల్ వ్యాధులు , టిబి ముక్త్ భారత్, వైద్య కళాశాలల అవసరాలు మొదలైన వాటి పురోగతి నిరంతరాయంగా జరుగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ల ఆదేశించారు. రెవెన్యూ, గృహనిర్మాణం, ఆరోగ్యం, వ్యవసాయం, అటవీ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ కు హాజరయ్యారు. ప్రజల జీవితాల్లో శాశ్వత ప్రభావం చూపేలా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని సీఎస్ కోరారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కలెక్టర్లు తమ జిల్లాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి అపారమైన అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఇకపై ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సమీక్షించి, మంజూరు ప్రక్రియను జారీ చేయాలని కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి కోరారు. మంజూరు చేయబడిన అన్ని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వనమహోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని అన్నారు. జిల్లా పర్యవేక్షణ సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని, సంబంధిత విభాగాలతో జిల్లాలో సమర్థవంతంగా సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు. వనమహోత్సవంలో మంచి నాణ్యత గల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనే విషయాలను నిర్ధారించుకోవాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు, ముఖ్యంగా పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని, మొక్కల మనుగడను కూడా పరిశీలించాలని కలెక్టర్లకు చెప్పారు.

పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్ని విభాగాలను కలుపుకుని మొక్కల పెంపకం చేపట్టడానికి లక్ష్య విధానాన్ని సూచించారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని ఆమె అన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ, తగినంత పరిమాణంలో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రత్యేక అధికారులు తమ జిల్లాల్లోని ఎరువుల షాపులను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని ఆయన అన్నారు. ఆయిల్ పామ్ విషయంలో, ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని చేపట్టడానికి వారి జిల్లాల్లో పెద్ద ప్రాంతాలను గుర్తించాలని అలాగే రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్లను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెవెన్యూ సదస్సులో 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. దరఖాస్తులను వ్యక్తిగతంగా పర్యవేక్షించి, మానవీయ దృక్పథంతో వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన సూచించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాపించే వ్యాధులపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కోరారు.

టీబీ ముక్త్ భారత్ అభియాన్ పై, జిల్లా కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, DMHOలు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు, రెడ్ క్రాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్లతో కూడిన కన్వర్జెన్స్ సమావేశాన్ని కూడా నిర్వహించాలని ఆయన జిల్లా కలెక్టర్లను సూచించారు. ముఖ్యంగా వైద్య కళాశాలల అవసరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జె చోంగ్తు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, PCCF, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Next Story