రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్.. రాజ్యసభ సీట్లు దక్కేదెవరికి?

by Prasad Jukanti |

తెలంగాణలో రాజ్యసభ స్థానాలకు అవకాశం దక్కించుకోబోయే అదృష్టవంతులెవరో?

రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్..  రాజ్యసభ సీట్లు దక్కేదెవరికి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు క్రమంగా కీలక దశకు చేరుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావడంతో ఇక పరిపాలన, పార్టీ బలోపేతంపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదులుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయం రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డిలు ఏప్రిలో 9వ తేదీన రిటైర్ కానున్నారు. దీంతో ఈ స్థానాల భర్తీకి మార్చి తోలివారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

రేవంత్ వర్సెస్ కేసీఆర్:

ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అకాశం ఉండగా రెండో స్థానం కోసం అధికార, ప్రతిపక్షాల మధ్య నెంబర్ గేమ్ అనివార్యం కానుందనే అంచనాలు ఉన్నాయి. ఒక్క స్థానం గెలిచిందుకు 40 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 66 మంది సభ్యులు ఉండగా బీఆర్ఎస్‍కు 37 మంది, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐ కి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని ఈజీగా తన ఖాతాలో వేసుకోబోతోంది. దీంతో రెండో స్థానం గెలిచేందుకు నెంబర్ గేమ్ అనివార్యం కానుంది. ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకోవాలంటే ఆ పార్టీకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అవసరం. ఇందులోనూ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వారు సాంకేతికంగా బీఆర్ఎస్‍లో కొనసాగుతున్నా రాజకీయంగా వారు ఎటువైపు నిలుస్తారు అనేది బీఆర్ఎస్ కు టెన్షన్ గా మారనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, గులాబీ బాస్ కేసీఆర్ మధ్య రెండో స్థానం కోసం ఎలాంటి పొలిటికల్ గేమ్ నడవనుంది అనేది ఆసక్తిగా మారింది.

ఆ అదృష్టవంతులెవరో?

రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాలను ఎవరితో భర్తీ చేయబోతున్నారు అనేది చర్చనీయాశంగా మారింది. గెలుపు ఓటముల విషయంలో నెంబర్ గేమ్ ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎవరికి రాజ్యసభ అవకాశం ఇవ్వనుంది అనేది ఆసక్తిగా మారింది. రెండు స్థానాల్లో బరిలోకి దింపితే ఒకటి తిరిగి అభిషేక్ మను సింఘ్వీ అవకాశం ఇచ్చి ఇంకొకటి రాష్ట్రానికి చెందిన వారిని బరిలోకి దింపనుందనే చర్చ జరుగుతోంది. అసలే రాష్ట్రంలో అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్‍లో రాజ్యసభ అవకాశం ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్నా ఎలాంటి పదవులు లేవని అందువల్ల తమకు అవకాశం కల్పించాలని అధిష్టానం వద్దకు ఇప్పటి నుంచే విజ్ఞప్తులు పంపుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాజ్యసభ స్థానాల కోసం చాన్స్ కొట్టేయబోతున్న ఆ అదృష్టవంతులు ఎవరో అనే టాక్ వినిపిస్తోంది.

Next Story