మా నోటి దగ్గర ముద్దను లాక్కున్నారు.. హైకోర్టు ఉత్తర్వులపై మాజీ ఎంపీ వీహెచ్​ ఆవేదన

by Ramesh Naini |

బీసీ రిజర్వేషన్ల పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమ నోటి దగ్గర ముద్దను లాక్కున్నారని మాజీ ఎంపీ వీ.హన్మంతరావు ఆవేదన వ్యక్తం చేశారు.

మా నోటి దగ్గర ముద్దను లాక్కున్నారు.. హైకోర్టు ఉత్తర్వులపై మాజీ ఎంపీ వీహెచ్​ ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో : (BC Reservations) బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పంద‌న సరిగా లేకపోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి రాష్టాన్ని స్తంభింప‌జేస్తామ‌ని బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య (R Krishnaiah) హెచ్చరించారు. బీసీల్లో ఏంతో చైత‌న్యం వ‌చ్చిందని, ఊరురా స్పంద‌న తెలుపుతామని, దేశాన్ని క‌దిలించేలా బంద్ ఉంటుందన్నారు. గురువారం ఆయన హైకోర్టు దగ్గర మీడియాతో మాట్లాడుతూ బీసీలంటే ఏం త‌మాషాగా ఉందా..? బీసీలంటే అంత చుల‌క‌న‌గా ఉందా..? సీఎం ప‌ద‌వులు రావు, మంత్రి ప‌ద‌వులు రావు, లేక లేక స‌ర్పంచ్ అవ‌కాశం వ‌స్తే వాటిని కూడా లాగేసుకోవ‌డం స‌రికాదని ఆయన మండిపడ్డారు. ఈ స‌మాజంలో బీసీల స‌త్తా ఏంటో చూపిస్తామని, రాస్తారోకోలు, ధ‌ర్నాలు చేస్తామ‌ని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఎన్నిక‌ల ప్రక్రియ‌ను రెండు వారాల పాటు ఆప‌డ‌మ‌నేది దుర‌దృష్టక‌రమని, ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యాక ఎన్నిక‌ల‌ను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్ధంగా రెండు వారాల పాటు ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం తాము తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామని ఆయన చెప్పారు.

బీసీ రిజర్వేషన్ల రాకపోవడానికి బీజేపీనే కారణం : జాజుల శ్రీనివాస్ గౌడ్

కోర్టులో రిజర్వేషన్లపై స్టే విచారకరమని, బిల్లులు ఆమోదముద్ర కాకపోవడానికి బీజేపీనే కారణమనని జాతీయ బీసీ సంఘాల అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బిల్లుకు గవర్నర్​ఆమోదముద్ర వేస్తే ఈ పరిస్థితి రాకపోయేదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయం మీద బీసీలు నిరసనలు తెలపాలని, తమకు అన్యాయం చేసిన పార్టీలను శత్రువులుగా పరిగణించి ఎన్నికల్లో ఓడగొడతామన్నారు. బీసీల గొంతు కోస్తామంటే చూస్తూ ఊర్కొమని, సామాజిక విప్లవం మొదలైతుందన్నారు.

నోటి దగ్గరి ముద్దను లాక్కున్నారు : మాజీ ఎంపీ వీహెచ్​

బీసీ రిజర్వేషన్ల పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమ నోటి దగ్గర ముద్దను లాక్కున్నారని మాజీ ఎంపీ వీ.హన్మంతరావు (V. Hanumantha Rao) ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో తాము అడ్డుకోలేదని, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైకోర్టు దగ్గర బీసీ నేతల ఆందోళన

బీసీ రిజర్వేషన్లపై విచారణ జరుగుతున్న (Telangana High Court) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దగ్గర గురువారం పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, బీసీ నేతలు అక్కడికి చేరుకున్నారు. విచారణ అనంతరం స్టే విషయం తెలిసిన తర్వాత వారు ఆందోళ‌న‌కు దిగారు. బీసీ వ్యతిరేకులారా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జీవో 9 పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిన తర్వాత కోర్టు గేట్ నెం.4 దగ్గర నినాదాలు చేస్తూ, రోడ్డుపై బైఠాయించారు. వారిని ఉద్దేశించి పలువురు బీసీ సంఘం నేతలు మాట్లాడారు.

Next Story