- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో ఉత్తమ్ మార్క్ ప్రచారం.. 300 రోజుల్లో 3 లక్షల ఉద్యోగాల హామీ!
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: లౌకికవాదానికి తమిళనాడు పెట్టింది పేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడు ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన ఆయన.. గత మూడు రోజులుగా ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బుధవారం కోయంబత్తూరు సమీపంలోని సింగనల్లూర్ నుండి కవుండంపాలెం వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి, అనంతరం శివకాశికి చేరుకుని అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. శివకాశి నుండి డీఎంకే బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి. అశోకన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. "దేశంలో లౌకికవాదం కొనసాగాలంటే తమిళనాడు ఎన్నికలలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తమిళనాడులో విభజన రాజకీయాలకు చోటు లేదు. ఇక్కడ బీజేపీకి ప్రవేశం కూడా ఉండకూడదు" అని మంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21 పార్టీలతో ఏర్పడిన 'సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్' ఢిల్లీ నుండి గ్రామీణ స్థాయి వరకు విజయవంతంగా కొనసాగుతోందని, భవిష్యత్ ప్రధానిగా రాహుల్ గాంధీ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. మహిళా సాధికారతకు తమ కూటమి కట్టుబడి ఉందని తెలిపారు. సీఎం స్టాలిన్ పాలనను ప్రశంసిస్తూ.. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిన 300 రోజుల వ్యవధిలోనే 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్ర పోలీసు శాఖలో అర్హులైన పదివేల మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మహిళలకు అందిస్తున్న రూ. 1000 ఆర్థిక సహాయాన్ని రూ. 2000కి పెంచి ప్రతి నెలా అందిస్తామని ప్రకటించారు. ప్రజల స్పందన చూస్తుంటే ముఖ్యమంత్రిగా మరోసారి స్టాలిన్‌ను బలపరిచేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని, ఈ ఎన్నికలలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






