యూజ్‌లెస్ ఫెలో.. మైండ్ లేదా! సెక్రటేరియట్‌లో IASల తిట్ల దండకం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-13 02:19:34  IST  )

‘యూజ్ లెస్ ఫెలో.. మైండ్ లేదా!’.. సర్కారుకు ఆదాయం సమకూర్చే విభాగానికి సంబంధించి సెక్రెటేరియట్ లో బాధ్యతలు చూస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఉద్యోగుల పట్ల రొటీన్ గా ఉపయోగించే పదాలివి.

యూజ్‌లెస్ ఫెలో.. మైండ్ లేదా! సెక్రటేరియట్‌లో IASల తిట్ల దండకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘యూజ్ లెస్ ఫెలో.. మైండ్ లేదా..!’ సర్కారుకు ఆదాయం సమకూర్చే విభాగానికి సంబంధించి సెక్రెటేరియట్ లో బాధ్యతలు చూస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఉద్యోగుల పట్ల రొటీన్‌గా ఉపయోగించే పదాలివి. ఆయనొక్కరే కాదు.. సెక్రెటేరియట్ లో అనేక మంది ఐఏఎస్ లు.. కిందిస్థాయి ఆఫీసర్లు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. బ్యూరోక్రట్స్ తిట్లు వినలేక చాలా మంది ఎంప్లాయీస్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏదైనా తప్పు చేస్తే బాధ్యులైన వారిని హెచ్చరిస్తే తప్పులేదు కానీ.. అకారణంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరుష పదాలు వినలేక.. బయటికి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

‘స్పెషల్ సీఎస్’ల బూతు పురాణం

సర్వీసులో సుదీర్ఘ అనుభవం కలిగిన స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారులు చాలా హుందాగా, మర్యాదగా వ్యవహరించాలి. ప్రజలతో ఎలా మెలగాలి? పొలిటీషియన్స్ తో ఏ విధంగా వ్యవహరించాలి? కింది స్థాయి అధికారులను ఎలా ట్రీట్ చేయాలో వారి సర్వీస్ అనుభవం నేర్పిస్తుంటుంది. కానీ సెక్రెటేరియట్ లో పని చేస్తున్న ఓ ఇద్దరు స్పెషల్ సీఎస్ లు మాత్రం తమ కింది స్థాయి అధికారులపై బూతులు ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అకారణంగా తిట్టడం, తప్పు లేకున్నా దూషించడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా సర్కారుకు ‘రెవెన్యూ సంపాదించే ఓ విభాగం’ బాధ్యతలు చూస్తున్న అధికారి తీరుపై ఎంప్లాయీస్ సీరియస్ గా ఉన్నారు. ‘యూజ్ లెస్ ఫెలో, మైండ్ లేదా?’ అని తిట్టడం ఆయనకు రొటీన్‌గా మారిందని టాక్. చీఫ్ సెక్రెటరీ పోస్టు కోసం కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్న ఓ స్పెషల్ సీఎస్ సైతం.. బూతులను ప్రయోగించడంలో దిట్టా అని సెక్రెటేరియట్ లో చర్చ జరుగుతున్నది.

గొణుగుడు సెక్రెటరీ..

బీఆర్ఎస్ హయాంలో బిహార్ ఆఫీసర్ల టీమ్ లో ఒకడిగా ఉన్న ఓ ఐఏఎస్.. ఇటీవల ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి.. అత్యంత కీలకమైన శాఖ బాధ్యతలు సంపాదించారని టాక్. సదరు ప్రిన్సిపల్ సెక్రటరీ తీరుపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఆ ఆఫీసర్ పై ఆ శాఖలోని అధికారులకు మంచి ఒపీనియన్ ఉండేది. కానీ ఆయన ఆ శాఖ పూర్తి బాధ్యతలు చేపట్టిన తరువాత.. అసలు స్వరూపం బయట పడిందని చర్చించుకుంటున్నారు. ‘ఆయన చెప్పినట్లుగా పని చేసినా నచ్చదు. సొంతగా పనిచేస్తే ఒప్పుకోడు. దీంతో ఏం పనిచేయాలో, ఎలా పనిచేయాలో తెలియడంలేదు’ అని ఆ శాఖ అధికారులు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తున్నది. ఏదైనా పొరపాటు జరిగితే.. సారీ చెప్పినా వినకుండా చాంబర్ లో ఉన్నంత సేపు గొణుగుతూ ఉంటాడనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆయన చాంబర్ లోకి వెళ్లేందుకే ఆఫీసర్లు జంకుతున్నట్లు సమాచారం.

సెంట్రల్ సర్వీస్‌లో ఇదే తీరా?

సుదీర్ఘ కాలం సెంట్రల్ సర్వీసులో పనిచేసి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఓ ఐఏఎస్ అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. ప్రతి ఫైల్ పై డిస్కషన్ అని రాయడం, కొర్రీలు పెట్టడం పరిపాటిగా మారిందనే ప్రచారం ఉంది. తప్పు చేయకున్నా.. కింది స్థాయి అధికారులను పిలిచి చివాట్లు పెట్టడం, యూ గెట్ అవుట్ అని గట్టిగా అరవడం ఆయనకు హాబీగా మారినట్లు టాక్. దీంతో సెక్రెటేరియట్ సర్వీసులో దాదాపు 25 ఏళ్ల సర్వీస్ ఉన్న సీనియర్ అధికారులు.. ఫైల్ క్లియరెన్స్ కోసం ఆయన వద్దకు వెళ్లాలంటే జంకుతున్నట్లు సమాచారం. ఆయన సెంట్రల్ సర్వీసులో సుదీర్ఘ కాలం పనిచేసి నేర్చుకున్న అనుభవం ఇదేనా? అని ఎంప్లాయీస్ చర్చించుకుంటున్నారు.

అన్ ‘హెల్త్’ అధికారులు

హెల్త్ డిపార్ట్ మెట్ లో పని చేస్తున్న అధికారులు.. ఆ శాఖలోని ఓ ఐఏఎస్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. చీటికి మాటికి పిలిచి చివాట్లు పెట్టడం సదరు ఆఫీసర్ కు పరిపాటిగా మారిందని టాక్. ఆ ఆఫీసర్ ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో తెలియక ఆ శాఖలోని ఎంప్లాయీస్ తెగ టెన్షన్ పడుతున్నారు. కొన్నిసార్లు విజిటర్స్ ను సైతం తనదైన శైలిలో చివాట్లు పెడతారనే విమర్శలు ఉన్నాయి.

‘హరాస్‌మెంట్’ ఆఫీసర్

తను ఉన్నంత సేపు ఆఫీసులోనే ఉండాలని ఓ స్పెషల్ సెక్రెటరీ ఆదేశించడం వివాదాస్పదంగా మారింది. పని లేకున్నా ఆఫీసులో ఉండాల్సి వస్తుండడంతో సదరు శాఖ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు రాత్రి పది వరకు ఆ స్పెషల్ సెక్రటరీ ఆఫీసులోనే ఉంటుండంతో ఆ శాఖలోని అన్ని సెక్షన్లకు చెందిన అధికారులు, చివరికి మహిళా ఆఫీసర్లు సైతం సెక్రెటేరియట్ లోనే ఉండాల్సి వస్తున్నది. దీంతో ఆ స్పెషల్ సెక్రెటరీకి ‘హరాస్ మెంట్’ ఆఫీసర్ అనే బిరుదు ఇచ్చారు.

తిట్లలో ఆ హెచ్ఓడీ స్పెషల్ డిగ్రీ

డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీ నుంచి ఇక్కడికి వచ్చిన ఓ ఐఏఎస్ తీరు హాట్ టాపిక్ గా మారింది. సదరు ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్ లోనే జిల్లా అధికారులను తిడుతుంటారని ప్రచారం ఉంది. ఆ శాఖకు చెందిన ఓ జిల్లా అధికారి.. ఒక రోజు కలెక్టర్ తోపాటే టూర్ కు వెళ్లారు. ఆయనకు బదులుగా తన తరువాత స్థాయి ఆఫీసర్ కు వీడియో కాన్ఫరెన్స్ బాధ్యతలు అప్పగించారు. వీడియో కాన్పరెన్స్ కు ఆ జిల్లా అధికారి డుమ్మా కొట్టడం ఆయనకు తీవ్ర కోపం తెప్పించింది. ‘నేను హెచ్ఓడీని. నేను ఎక్కువ. నన్ను కాదని జిల్లా కలెక్టర్ పొగ్రాం కు ఎలా వెళ్తావ్. వెంటనే హైదరాబాద్ కు వచ్చి రిపోర్టు చేయాలి’ అని ఆదేశించారు. దీంతో 300 కిలోమీటర్లు దూరం నుంచి ఆ జిల్లా అధికారి ఉరుకులు పరుగులతో హైదరాబాద్ కు వచ్చి ఆ హెచ్ఓడీ ని కలిశారు. అప్పుడు కూడా ఆ ఐఏఎస్.. ఆ జిల్లా ఆఫీసర్ ను తీవ్రంగా తిట్టినట్లు ఆ శాఖలో డిస్కషన్ జరిగింది.

ఫిర్యాదు చేసేందుకు రెడీ!

గతంలో ఒకరిద్దరు ఐఏఎస్ లు మాత్రమే తమ కింది స్థాయి ఆఫీసర్లను తిట్టేవారని, కానీ ఈ మధ్య ఆ రోగం చాలా మంది ఆఫీసర్లకు పాకిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో రిటైర్మెంట్ కు ఇంకా రెండు, మూడేళ్ల సర్వీస్ మిగిలి ఉన్న అధికారులు.. బీపీ, షుగర్లు పెరిగి ఇబ్బంది పడుతున్నట్లు చర్చ జరుగుతున్నది. కొందరు రెండు, మూడు రోజులు వరుసగా సెలవులు పెడుతున్నారు. మళ్లీ డ్యూటీలోకి రాగానే సీన్ రిపీట్ అవుతుండటం రొటీన్ గా మారింది. ‘గతంలో ఆఫీసు అంటే ఉత్సాహం ఉండేది. టైమ్ తో సంబంధం లేకుండా పనిచేసేవాళ్లం. ఇప్పుడు ఐఏఎస్ చివాట్లు వినలేక డ్యూటీకి రాలేకపోతున్నం. లాంగ్ లీవ్ లోకి వెళ్తాం. ఈ వయసులో ఎందుకు ఆ తిట్లు. ఆ మాటలు వినలేక చస్తున్నాం’ అని బాధిత అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై ఇప్పటికే సెక్రెటేరియట్ ఎంప్లాయీస్.. అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సమయం, సందర్భం చూసుకుని సదరు ఐఏఎస్ లపై సీఎస్, సీఎంకు ఫిర్యాదు చేసేందుకు అసోసియేషన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

Next Story