రాష్ట్రంలో కొలిక్కిరాని ‘ఈడీ’ కేసులు.. నత్తనడకన విచారణ

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఈడీ విచారణ చేపట్టిన కేసుల్లో ఏ ఒక్కటీ కొలిక్కి రావడం లేదు.

రాష్ట్రంలో కొలిక్కిరాని ‘ఈడీ’ కేసులు.. నత్తనడకన విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈడీ విచారణ చేపట్టిన కేసుల్లో ఏ ఒక్కటీ కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై నమోదైన కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో కమలం, గులాబీ పార్టీల మధ్య తెరవెనుక పొత్తు ఉందని కాంగ్రెస్ పెద్దఎత్తున ఆరోపిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కౌంటర్ వేస్తున్నాయి. సిట్, ఏసీబీ కేసులను ప్రస్తావిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా.. బీఆర్‌ఎస్, ​బీజేపీ ఒకటని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్​ ఒక్కటేనని బీజేపీ కామెంట్స్ చేస్తున్నది. ఒకే విషయంపై ఎవరికి వారు కొత్త భాష్యాలు చెబుతూనే ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ 11 ఏండ్లుగా అధికారంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత పదేండ్లు బీఆర్‌ఎస్ పాలన సాగించగా.. గత 20 నెలల నుంచి కాంగ్రెస్ ​అధికారంలో కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అవకతవకలు, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, నిధుల వినియోగం తదితర అంశాలపై మూడు పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి.

రంగంలోకి ఈడీ..

గత బీఆర్‌ఎస్​ ప్రభుత్వం లో జరిగిన అవినీతి, అక్రమాలపై కేంద్రంలోని బీజేపీ ఇన్నాళ్లు ఒక్క కేసు సైతం ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నది. రాష్ట్రంలో 20 నెలలుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్, అప్పటి మంత్రులపై కేసులు నమోదు చేయకుండా ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారని బీజేపీ కౌంటర్ ఇస్తున్నది. ఏసీబీ, సిట్ అధికారులను కాంగ్రెస్ ప్రభావితం చేస్తూ కేసులను ముందుకు వెళ్లనివ్వడం లేదని, గులాబీ పార్టీ పట్ల మెతక వైఖరితో ఉంటున్నారని, అందుకే వారిని అరెస్టు చేయట్లేదని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు కమలం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, ఇప్పటి వరకు ముఖ్య రాజకీయ నేతలతో పాటు ఎవరినీ అరెస్టు చేయకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను ఒక తీరుగా.. కేంద్రంలోని ఈడీని ఒక తీరుగా బీజేపీ నేతలు చూస్తున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్​పార్టీ అవినీతిపై ఒక్క కేసూ నమోదు చేయలేదని వారిమధ్య సంబంధాలు లేకుంటే కేసు ఎందుకు పెట్టడం లేదని, విచారణ ముందుకు ఎందుకు సాగడం లేదని నిలదీస్తున్నారు.

‘గొర్రెల స్కామ్‌’పై కనిపించని కదలిక

గత ప్రభుత్వంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​పశుసంవర్ధక శాఖగా మంత్రిగా ఉన్న సమయంలో గొర్రెల పంపిణీ స్కీంను ప్రారంభించారు. ఈ పథకం పూర్తిగా దుర్వినియోగం అయిందని, అక్రమాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ ఆధారాలతో సహా బయటపెట్టింది. దీంతో ఏసీబీ కేసు నమోదు చేసి అధికారులను అరెస్ట్ చేసింది. వారిని అనేక రోజులు జైల్లో ఉంచారు. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన వివరాలు అన్నింటినీ ఈడీ తీసుకుని కేసు నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలనూ తనిఖీ చేసింది. 200 పైగా మ్యూల్ ఖాతాలను గుర్తించింది. గతంలో ఏసీబీ రూ.750 కోట్ల వరకు అవినీతి జరిగిందని గుర్తిస్తే.. ఈడీ మాత్రం ఏకంగా రూ.1000 కోట్లకు పైనే అవినీతి, అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొంది. మంత్రికి తెలియకుండా ఆయన ఓఎస్డీ రూ.వెయ్యి కోట్లకు పైగా స్కామ్ ఎలా చేస్తాడంటూ పలువురు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఈ కేసులో ఇప్పటి వరకు నాటి మంత్రిని ఈడీ విచారించలేదు, ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదు.

కొలిక్కిరాని ఫార్ములా ఈ కార్ కేసు..

బీఆర్‌ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధం ఉన్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులోనూ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అనే తరహాలో ఈడీ విచారణ సాగుతున్నది. ఏసీబీ విచారణలో రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు ఉంటాయని భావిస్తున్న తరుణంలో ఈడీ ఎంటరైంది. దీంతో కేసు తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఏసీబీ విచారణ జరుగుతున్న టైంలోనే ఈడీ కేసు నమోదు చేయడంతో పాటు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. నాటి నుంచి నేటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేశారని.. ఆర్థిక నేరం కింద కేసు నమోదు చేసింది. ఆర్థిక నేరాల్లోని కేసులు అంత సులువైనవి కావు. కానీ, వారిపై ఎలాంటి కఠిన చర్యలు లేకుండా విచారణ కొనసాగుతున్నది. తొలి సారి విచారణ జరిపి నెలలు గడుస్తున్నా... తదుపరి విచారణలో మాత్రం ముందడుగు పడలేదు. ఇదిలాఉండగా, తమకు వ్యతిరేంగా ఆధారాలుంటే ఎందుకు అరెస్ట్ చేయరని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫోన్​ట్యాపింగ్​కేసును సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే బీఆర్‌ఎస్​నేతలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికే బీజేపీ ప్రయత్నిస్తుందని, విచారణ ముందుకు సాగదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించబోమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఈడీ దర్యాప్తు చేపట్టిన కేసులు ఇవే

రాష్ట్రంలో అనేక అంశాల్లో ఈడీ కేసులను నమోదు చేసి విచారణ జరుపుతున్నది. కానీ, ఎందులోనూ పురోగతి కనిపించడం లేదు. ప్రస్తుతం ఈడీ పరిధిలో సినీ నటులు, ప్రముఖుల ప్రమేయం ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు, రూ.వందల కోట్ల వ్యవహరమున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసు, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్, సాహితి ఇన్‌ఫ్రా, ఫాల్కన్ స్కామ్, సాయి శ్రీ, సూర్య డెవలపర్స్, ఎంబీఎస్ జ్యువెలర్స్, హెచ్ఎండీఎస్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, బంగ్లాదేశ్ వ్యభిచార ముఠా ఆస్తుల జప్తు, లూసెంట్ డ్రగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ (పాకిస్థాన్‌కు ట్రామిడాల్ డ్రగ్ సరఫరా) ఇలా అనేక ఇష్యూలపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కానీ, ఏ కేసులోనూ ఇప్పటికి నిందితులను అరెస్టు చేయలేదు.

Next Story