స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ కు అనూహ్య స్పంద‌న‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

by Muthe.Rajitha |

ప్రజలకు సులువుగా న్యాయమైన, వేగవంత‌మైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ సేవ‌ల‌ను ప్రారంభించిన‌ట్లు రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ కు అనూహ్య స్పంద‌న‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు సులువుగా న్యాయమైన, వేగవంత‌మైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ సేవ‌ల‌ను ప్రారంభించిన‌ట్లు రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలోని 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో గురువారం నుండి స్లాట్ బుకింగ్ విధానం అమ‌లు లోకి వ‌చ్చింద‌ని ఇక్కడ వ‌చ్చే ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామ‌న్నారు. రెవెన్యూ విభాగంలో ఏ సంస్కరణ చేప‌ట్టినా, ఏ విధానప‌ర‌మైన నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలోనే ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు. తొలిరోజు స్లాట్ బుకింగ్ అమ‌లు, ప్రజల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ స్లాట్ బుకింగ్‌పై ప్రజల‌లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఆస్తుల రిజిస్ట్రేష‌న్ కోసం తొలిరోజు గురువారం నాడు 626 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నార‌ని తెలిపారు. రిజిస్ట్రేష‌న్‌కు వ‌చ్చి గంట‌ల త‌ర‌బ‌డి చెట్ల కింద నిరీక్షించి క్యూ లైన్లలో నిల్చోనే ప‌రిస్దితికి అడ్డుక‌ట్ట వేసేందుకు, స‌మ‌యాన్ని ఆదా చేసేందుకు, పార‌ద‌ర్శకతను తీసుకురావ‌డానికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావ‌డం జ‌రిగింద‌న్నారు.

త్వరలో క్యూ లైన్లకు గుడ్‌బై చెప్పే రోజులు వ‌స్తాయ‌ని, అంతే కాకుండా ద‌ళారుల ప్రమేయం కూడా ఉండ‌బోద‌న్నారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ పూర్తి అవుతుండ‌డం ప‌ట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రిజిస్ట్రేష‌న్ శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ స‌మ‌యానికి వ‌చ్చి రిజిస్ట్రేష‌న్ చేయించుకునేలా స్లాట్ బుకింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అలాగే సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయ‌ని అన్నారు. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా అపాయిమెంట్‌ తేదీ, సమయాన్ని కూడా ముందే తెలుసుకోవచ్చునన్నారు. నిర్దేశిత తేదీ, సమయంలో ఎటువంటి హడావుడి లేకుండా రిజిస్ట్రేషన్‌ పని పూర్తి చేసుకోవచ్చునన్నారు. కొనుగోలు దారులు, అమ్మకం దారులు, సాక్షులు తగిన సమయంలోనే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు చేరుకోవడానికి వీలు కలగనుందని, పారదర్శకతతో మధ్యవర్తుల ప్రభావానికి తెరపడనుందన్నారు.


స్లాట్ బుకింగ్ అనుభ‌వాలు ఇవీ.....

స్లాట్ బుకింగ్ విధానం అద్భుతంగా ఉంది : గ‌ట్టు శ్రీ‌నివాస్ (మేడ్చల్​స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్)

గురువారం నాడు మేడ్చల్​స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ఓ ఆస్తి కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ పూర్తిచేసుకున్నాం. ఈ నూత‌న విధానం క్రయ , విక్రయదారులకు చాలా సౌక‌ర్యంగా ఉంది. రిజిస్ట్రేష‌న్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుని నిర్ణీత స‌మ‌యానికి వెళ్లాం, తొలిరోజైన‌ప్పటికీ కూడా కేవ‌లం 20 నుంచి 30 నిమిషాల వ్యవధి లోనే ఈ ప్రక్రియ పూర్తయింది. తామే రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్‌లో డాక్యుమెంట్లను అప్‌ లోడ్ చేశాం. అన్నీ ఆన్‌లైన్‌లోనే జ‌రిగినందున ఎక్కడ ఇబ్బంది ప‌డ‌లేదు, మాకు స‌మ‌యం పూర్తిగా ఆదా అయింది. ఎక్కడా అసౌక‌ర్యం కలగలేదు. రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది చాలా సేవాభావంతో స‌హ‌క‌రించారు. ఈ కొత్త స్లాట్ బుకింగ్ విధానం చాలా బాగుంది. అధికారుల‌పై వ‌త్తిడి క‌నిపించ‌లేదు. ఎటువంటి అద‌న‌పు ఖ‌ర్చులు లేకుండా సుల‌భంగా అంతా సాఫిగా సాగింది. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది.

కొత్త విధానాన్నే కొన‌సాగించండి : ఘ‌న శ్యామ్ ప‌టేల్ ( శంషాబాద్ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌)

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానం తొలిరోజున కొంత స‌మ‌యం తీసుకున్నా రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ సాఫీగా సాగింది. శంషాబాద్‌ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో గురువారం నా ఫ్లాట్‌ను మ‌రొక‌రికి రిజిస్ట్రేష‌న్ చేయించాను. మొత్తం ప్రక్రియ చాలా వెసులుబాటుగా, స‌మ‌యం ఆదా చేసేవిధంగా ఉంది. న‌న్ను నిర్ధిష్ట సమ‌యానికి పిలిచిన‌ప్పటికీ కొన్ని డాక్యుమెంట్ల స‌మ‌ర్పణ, , స‌మాచార పూర్తిగా సక్రమంగా లేనందున సుమారు గంట‌కుపైగా ఆల‌స్యం జ‌రిగింది. ఈ విష‌యంలో రిజిస్ట్రార్ కార్యాల‌యం త‌ర‌పున ఎటువంటి జాప్యం లేదు. క్రయ, విక్రయ దారులు పూర్తి అవ‌గాహ‌న పెంచుకుంటే కేవ‌లం అర‌గంట‌లోగానే ప‌నులు పూర్తయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. కార్యాల‌యంలో ఎటువంటి అవినీతి, ర‌ద్దీ లేకుండా సాగిన ఈ ప్రక్రియ ను ఇలాగే కొన‌సాగించాలి. దీని వ‌ల‌న ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్యాల‌య సిబ్బంది నుంచి స‌హ‌కారం, మార్గదర్శకత్వం ల‌భించాయి. అందువ‌ల‌న తాము ఎక్కడా ఇబ్బంది ప‌డ‌లేదు.

అప్పుడు 3 గంట‌లు ఇప్పుడు అర‌గంట లోపే : సి.స్వాతి (వ‌ల్లభ్​న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసు)

స్లాట్ బుకింగ్ విధానంలో మార్ట్‌గేజ్ ( త‌న‌ఖా) రిజిస్ట్రేష‌న్ చాలా సులువుగా సాగింది. ఆస్తి మార్ట్‌గేజ్ రిజిస్ట్రేష‌న్‌ కోసం స్లాట్ బుకింగ్ చేసుకొని వ‌ల్లభ్​నగర్​స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యానికి వెళ్లాము. కేవలం 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ పూర్తిచేసుకొని బ‌య‌ట‌కు వచ్చాం. మూడు నెల‌ల క్రితం ఇదే ఆఫీసులో రిజిస్ట్రేష‌న్‌కు వ‌స్తే 2 నుంచి 3 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఈ స్లాట్ బుకింగ్ వల్ల స‌మ‌యం ఆదా అవడం తో పాటు అనుకున్న స‌మ‌యానికి ప‌నిపూర్తి చేసుకొని స్వంత‌ ప‌నుల‌కు వెళ్లిపోయేందుకు ఈజీ అయింది.

Next Story