మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తోంది?.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనలో విస్తుపోయే విషయాలు

by Prasad Jukanti |

కింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

మెడికల్ కౌన్సిల్  ఏం చేస్తోంది?.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనలో విస్తుపోయే విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (universal srushti fertility centre secunderabad) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్వాహకురాలు డాక్టర్ అట్లూరి నమ్రత (Dr.Namrata) అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అనుమతులు లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను నిర్వహించడమే కాకుండా సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ (Child Trafficking) చేసి రూ. లక్షలు గడించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఇంత పెద్దఎత్తున ఈ రాకెట్ నడుస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందనే అంశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గతంలోనే పలు కేసులు..

సికింద్రాబాద్, కొండాపూర్, విశాఖ పట్నం, విజయవాడల్లో ఫెర్టిలిటీ సెంటర్లు నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రత 1995 నుంచి వైద్య వృత్తిలో ఉన్నారు. 1998 నుంచి ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ రంగంలోకి దిగారు. కాసుల కక్కుర్తికి అలవాటు పడిన ఆమె సంతానం కోసం వచ్చే దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. గతంలోనే ఆమెపై అనేక ఆరోపణలు ఉండగా పలు కేసులు సైతం నమోదు అయ్యాయి. అక్రమంగా పసిపిల్లలను విక్రయిస్తూ పట్టుబడిన యూనివర్సల్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసును సుమోటోగా స్వీకరించి విచారించాలని నాలుగేళ్ల క్రితమే ఏపీ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న డా.నమ్రత వైద్యడిగ్రీని తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ ఆమెపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్‌ను 2021లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పొడిగించలేదు. కానీ తాజాగా సికింద్రాబాద్ యూనివర్సల్ ఫెర్టిలిటీ కేంద్రంలో వెలుగు చూసిన ఘటనతో నమ్రత అక్రమ దందా ఏ రేంజ్‌లో కొనసాగుతోందో అర్థం అవుతున్నది. అనుమతులు నిరాకరించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఇంటర్నెట్‌లో బహిరంగంగానే డాక్టర్ నమ్రత సరోగసీ రాకెట్ నడిపిస్తుంటే మెడికల్ కౌన్సిల్‌తో పాటు పోలీసులు, ఇతర నిఘా సంస్థలు, ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరు?..

సరోగసీ నిర్వహించకుండానే ఇతరుల పిల్లలను తీసుకొచ్చి సంతానం కోసం వచ్చేవారికి అప్పగిస్తుండం వెనుక పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారనే అరోపణల నేపథ్యంలో ఇప్పటివరకు సరోగసి పేరెంట్స్‌కు అప్పగించిన చిన్నారుల అసలు తల్లిదండ్రులు ఎవరు? వారికి ఎక్కడి నుంచి తెచ్చారు? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇల్లీగల్ దందాపై ఎవరికైనా ఏదైనా సందేహం కలిగి ప్రశ్నిస్తే వెంటనే నమ్రత కుమారుడు, న్యాయవాది జయంత్ కృష్ణ రంగంలోకి దిగుతారని తెలిసింది. సృష్టి ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న జయంత్ కృష్ణ ఈ వ్యవహారంపై ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు తిరగడమే కాకుండా ఈ అంశంలో నేరం మీదేనని, బయటకు వస్తే అరెస్టు అవుతారంటూ బెదిరింపులకు పాల్పడుతాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా వీరి బారిన పడి మోసపోయిన వారి సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story