‘కళ్లు ఉంటే చూడండి.. చెవులుంటే వినండి.. అంతేగానీ విమర్శలు చేయకండి’: కిషన్ రెడ్డి సీరియస్

by Gantepaka Srikanth |

వరంగల్‌ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట రైల్వే కోచ్‌(Kazipet Railway Coach)‌ను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.

‘కళ్లు ఉంటే చూడండి.. చెవులుంటే వినండి.. అంతేగానీ విమర్శలు చేయకండి’: కిషన్ రెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట రైల్వే కోచ్‌(Kazipet Railway Coach)‌ను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. శనివారం కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి కిషన్‌ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లా ప్రజల తరపున, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnav)కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని, మంజూరు చేశారని అన్నారు.

‘అనంతరం ప్రధాని మోడీ స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, అలాగే పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తాయి. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తారనడానికి ఇది మరో సాక్ష్యం. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోంది. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమే. వరంగల్‌లో రింగ్‌రోడ్‌లో 50 శాతం పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. టెక్స్‌టైల్ ఇండస్ట్రీని మంజూరు చేసింది. వెయ్యి స్తంభాల గుడిలో మంటపాన్ని పునరుద్ధరించడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అవసరం ఎంతో ఉందని నేను గత బీఆర్ఎస్ పాలన సమయంలో కేసీఆర్‌కి అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించాను. ఇప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విన్నవించాను’ అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

‘ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పగిస్తే, వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుంది. ప్రధాని మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు తమ కళ్లు తెరిచి చూడాలి, చెవులుంటే వినాలి. మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలని నేను కోరుతున్నాను. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా కాజీపేటకు వచ్చి రైల్వే మాన్యుఫాక్చరింగ్ పనులను పర్యవేక్షించడం.. ఆయన రైల్వేల అభివృద్ధిపై చూపుతున్న నిబద్ధతకు నిదర్శనం. వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వేల విస్తరణ.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో అశ్వినీ వైష్ణవ్ గారు తెలంగాణ రైల్వేల ముఖచిత్రాన్ని మారుస్తున్నారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.

Next Story