ఇందిరమ్మ పాలనంటే.. మతోన్మాదాన్ని ప్రోత్సహించడమా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 12 |
ఇందిరమ్మ పాలనంటే.. మతోన్మాదాన్ని ప్రోత్సహించడమా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇందిరమ్మ పాలనంటే.. మతోన్మాదాన్ని ప్రోత్సహించడమా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. చెంగిచెర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బండి సంజయ్, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం, పరామర్శించేందుకు వెళ్లాలనుకున్న రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేయడంపై గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. అక్రమంగా అరెస్టులు చేస్తారా? అని ధ్వజమెత్తారు. చెంగిచర్లలో బారికేడ్లు పెట్టి మరీ స్లాటర్ హౌస్ నడుపుతున్న మాఫియాకు వంతపాడడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంగిచెర్లలో అక్రమ స్లాటర్ హౌస్ ను తొలగించాలని, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు ఉపసంహరించుకోవాలని, బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాల్సిందేనని, బాధితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం కాంగ్రెస్ కు అలవాటేనని, అధికార ఉన్మాదంతో రగిలిపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ మతోన్మాదంతో, ఉద్వేగాలతో, అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం చాలా కోల్పోయిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సూచించారు. హిందువులను హింసించి దేశాన్ని సర్వనాశనం చేసే వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి సూచించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. బీఆర్ఎస్ సర్కారు తీరుతో దివాళా తీసిందని, అందుకే ప్రజలు నియంతృత్వ, అహంకారపు బీఆర్ఎస్ రజాకారు పాలనను ఛీత్కరించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చేతికి అధికారం అప్పజెప్పితే.. ఆ పార్టీ బుద్ధి మార్చుకోలేదని, కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ కు పట్టిన గతే పట్టడం ఖాయమన్నారు.

ఇదిలా ఉండగా బీజేపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో వివిధ రంగాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు గురువారం బీజేపీలో చేరారు. ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ అడిషనల్ డీసీపీ అత్తలూరి సుభాష్ చంద్రబోస్ కిషన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాగా ఆయనకు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Next Story

Most Viewed