- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాల్లో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్దిష్ట కాలపరిమితితో నియామక ప్రక్రియలను చేపడుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాల్లో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్దిష్ట కాలపరిమితితో నియామక ప్రక్రియలను చేపడుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం చాంద్రాయణగుట్టలోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో నిర్వహించిన 18వ విడత ఉద్యోగ మేళాకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాల్లో నియామక ప్రక్రియ క్రమబద్ధీకరణ, వేగవంతం కోసం ప్రధాని మోడీ మేరకు 2022 నుంచి రోజ్‌గార్ మేళాలు నిర్వహిస్తున్నామని, కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన యువత వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా అంకుర సంస్థలను ప్రోత్సహించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ ఉపాధి కల్పనను పెంచడంపై కేంద్రం దృష్టి సారించిందన్నారు.
ప్రస్తుత ప్రపంచ అనిశ్చితుల మధ్య ప్రపంచ దేశాలకు భారత్ నమ్మకమైన గమ్యస్థానంగా ఉంది.. ఆయా దేశాల నుంచి వచ్చే కొత్త పెట్టుబడులు మన దేశంలో ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడతాయని వెల్లడించారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 213 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. సీఆర్‌పీఎఫ్‌లో 179, ఎస్‌ఎస్‌బీలో 5, ఐటీబీపీలో 16, బీఎస్‌ఎఫ్‌లో 5, ఐఎఫ్‌ఎల్‌యూలో 1, ఐఐటీ-హైదరాబాద్‌లో 3, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1, విద్యా మంత్రిత్వ శాఖలో 3 ప్రొఫెసర్ పోస్టులు ఉండగా ఉద్యోగం పొందిన వారిలో 15 మంది మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ మెడికల్ ఐజీ గణేష్ చంద్ర పాడి, హైదరాబాద్ సెంటర్ డీఐజీ ఉదయ భాస్కర్ బిల్లా, కమాండెంట్ మోహన్ దాస్ కోబ్రుగాడే తదితరులు పాల్గొన్నారు.
61 వేల మందికి నియామక పత్రాలు : బండి సంజయ్
దేశ యువత పట్ల ప్రధాని మోడీకి అపారమైన శ్రద్ధ, ప్రేమ ఉందని, ఇంతకు ముందు నిర్వహించిన 17 ఉద్యోగ మేళాల ద్వారా యువతకు 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం అందించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్పేర్కొన్నారు. 18వ ఉద్యోగ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 61 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. హకీంపేట్ లో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (ఎన్ఐఎస్ఏ) నిర్వహించిన 18వ ఉద్యోగ మేళా కార్యక్రమంలో పాల్గొన్ని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కొత్తగా ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉద్యోగ మేళా అనేది భరోసా, ఆత్మవిశ్వాసం, బలాన్ని ఇచ్చే వేదికగా నిలుస్తుందని, ఇది వారు చదువులు, వృత్తిని అంకితభావంతో కొనసాగించేలా ప్రేరేపిస్తుందన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తూ సకాలంలో నియామకాలను చేపడుతోందన్నారు.
ఒక్క ఆరోపణ కూడా లేకుండా 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను అందించడం నియామక ప్రక్రియ పారదర్శకత, నిష్పక్షపాత, విశ్వసనీయతను తెలియజేస్తోందన్నారు. కేవలం జీతం కోసమే కాకుండా దేశం, సమాజానికి అంకితభావం, స్ఫూర్తితో సేవ చేయాలని ఎంపికైన వారిని కోరారు. కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 18వ ఉద్యోగ మేళాను నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్ఐఎస్ఏలో మొత్తం 238 మంది అభ్యర్థులు నియామక పత్రాలను అందుకున్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని పొందేందుకు కష్టపడ్డ తీరు, అనుభవాలను పంచుకున్నారు. వేగవంతమైన, నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.






