ప్రతీ భారతీయుడి ఫోన్‌లో ఆ యాప్ ఉండాలి.. బండి సంజయ్ పిలుపు

by Gantepaka Srikanth |

జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(National Disaster Management Agency) అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తెలిపారు.

ప్రతీ భారతీయుడి ఫోన్‌లో ఆ యాప్ ఉండాలి.. బండి సంజయ్ పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(National Disaster Management Agency) అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తెలిపారు. జాతీయ విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవలతోపాటు జాతీయ విపత్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు విస్త్రతంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను కోరారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘సచేత్ (sachet)యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా చైతన్యం కలిగించాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బందికి క్లిష్టమైన సమయాల్లో రోప్స్, గ్యాస్ కట్టర్స్, జాకెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు.

ఈరోజు న్యూఢిల్లీలోని ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ) సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్బంగా ఎన్డీఎంఏ ఉన్నతాధికారులతో సమావేశమై సంస్థ అందిస్తున్న సేవలను, చేపడుతున్న కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఎంఏ సేవలకు సంబంధించి కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ప్రధానంగా తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ వరదల (2025)తోపాటు సిక్కిం వరదలు, వయనాడ్ ల్యాండ్స్‌లైడ్, హిమాచల్ వరదల సమయంలో, బాలాసోర్ రైల్వే ప్రమాదం (2023), సిల్క్యారా టన్నెల్ రక్షణ చర్యల్లో(2023) భాగంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సాహసోపేత చర్యలను వివరించారు. Yuva Aapda Mitra Scheme కింద NCC, NYKS, BSG, NSS సంస్థల నుండి యువ వాలంటీర్లను చేర్చి, 28 రాష్ట్రాల్లో 2,37,326 వాలంటీర్లు మరియు 1,300 మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వబడింది, ఈ సంస్థలతో కలిసి విపత్తు స్పందన సేవల్లో యువతను భాగస్వామ్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విపత్తు సేవలు అందించే విషయంలో జపాన్, రష్యా, జర్మనీ, మాల్దీవులు, చిలీసహా 14 దేశాలతో అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. అత్యధిక వర్షాలు, వరదలు, విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు ‘సచేత్ (sachet)యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13.9 లక్షల డౌన్ లోడ్స్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా ఎక్కడ ఏ విపత్తు వచ్చే అవకాశం ఉందనే సమాచారం ప్రజలకు తెలుస్తుందని, తద్వారా ఆ విపత్తు నుండి బయటపడే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అద్భుతమైన సేవలు అందిసున్నప్పటికీ సరైన ప్రచారం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తుఫానులు, వరదలుసహా పెను ప్రమాదాలు ఏర్పడిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాహసోపేత సేవలు అందిస్తున్న విషయంపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా సచేత్ (sachet)యాప్ ను దేశ పౌరులంతా డౌన్ లోడ్ చేసుకునేలా విస్త్రత అవగాహన కల్పించాలని సూచించారు. రెస్క్యూ సిబ్బందికి జాకెట్, రోప్స్, గ్యాస్ కట్టర్స్ వంటి మౌలిక సదుపాయాలను కచ్చితంగా సమకూర్చాలన్నారు. దిశ మీటింగ్‌లో ఎన్డీఎంఏ సేవలను ఒక అంశంగా చేర్చే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అంతిమంగా “ప్రతి భారతీయుడు – ప్రతి విపత్తుకూ సిద్ధంగా ఉండేలా సంసిద్దులను చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

Next Story