ఒకప్పుడు నాకు హిందీ రాదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

దేశంలో ఉన్నత విద్య, పరిశోధనలు, స్టార్టప్‌లతోపాటు డిజిటల్ ప్లాట్‌ఫారాలు సొంత భాషల్లో అందుబాటులోకి వచ్చినప్పుడే జ్ఞానానికి నిజమైన ప్రజా స్వామీకరణ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు నాకు హిందీ రాదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఉన్నత విద్య, పరిశోధనలు, స్టార్టప్‌లతోపాటు డిజిటల్ ప్లాట్‌ఫారాలు సొంత భాషల్లో అందుబాటులోకి వచ్చినప్పుడే జ్ఞానానికి నిజమైన ప్రజా స్వామీకరణ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు భాషా సాంకేతికత ఈ దిశలో కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ రంగాల్లో భారతీయ భాషలను కేంద్రంగా ఉంచితే గ్రామీణ, పట్టణ భారత్ మధ్య ఉన్న డిజిటల్ అంతరం దానికదే తగ్గుతుందన్నారు. హిందీతోపాటు భారతీయ భాషలు కేవలం గతానికి చెందిన మన వారసత్వం మాత్రమే కాదని, అవి దేశ భవిష్యత్తుకు పునాదులుగా నిలుస్తాయని తెలిపారు. మంగళవారం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ దేవి అహిల్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మధ్య, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల ఉమ్మడి ప్రాంతీయ అధికారిక భాషా సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాజభాషలో విశిష్ట సేవలందించిన పలువురికి అవార్డులు అందజేశారు. వివిధ హిందీ సేవా సంస్థలు, బ్యాంకులు ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్ ను, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవి అహిల్యా విశ్వవిద్యాలయం వంటి జ్ఞానభూమిలో అధికారిక భాషా సమ్మేళనం జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు, దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర విభాగాలు, కార్యాలయాల్లో అధికారిక భాషా సంబంధిత నిబంధనల అమలును నిర్ధారించడంలో, పాలనలో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో రాజ్-భాషా విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

హిందీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో హిందీతోపాటు భారతీయ భాషలను పరిపాలనలో, సాంకేతికతలో ప్రపంచ స్థాయి సంభాషణలతో అనుసంధానించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. రాజభాషా విభాగం ప్రారంభించిన హిందీ శబ్ద సింధు, భారతీయ భాషా విభాగం, భారతి బహుభాషీ అనువాద సారథి వంటి అప్లికేషన్లు, ఆధునిక అనువాద సాధనాలు నేడు పరిపాలనను పారదర్శకంగా ప్రజలకు అందుతుంది. ఈ ప్రయత్నాలు భాష ఒక అడ్డంకిగా కాకుండా వారధిలా మారేలా చేస్తున్నాయి. నేడు హిందీ భాష ప్రపంచ వేదికపై కూడా బలంగా నిలిచింది. విద్య, మీడియా, సినిమా, సాహిత్యం, డిజిటల్ మాధ్యమాలు హిందీకి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చాయి. రాబోయే కాలం హిందీతోపాటు భారతీయ భాషలను విద్య, విజ్ఞానం, సాంకేతికత, న్యాయం, వ్యాపారం వంటి ప్రతి రంగంలో మరింత బలోపేతం చేయడానికి మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ, హిందీ వినియోగాన్ని మరింత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తారని, అలాగే ఇతరులను కూడా హిందీలో పని చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను తెలుగు మాట్లాడే తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చాను. ఒకప్పుడు నాకు హిందీ రాదు, కానీ అమిత్ షా ప్రోత్సాహంతో నా పనులన్నీ హిందీలోనే పూర్తి చేస్తున్నాను. రాజభాషా విభాగం చేస్తున్న ఈ ప్రయత్నాల ద్వారా మన పని తీరులో హిందీని మరింతగా ఉపయోగించేందుకు మనకు ప్రేరణ కలుగుతుందన్నారు.

Next Story