Bandi Sanjay: ఐఐఎస్ ట్రైనీ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక సూచనలు

by Ramesh Naini |   (  Updated:2026-04-07 15:01:18  IST  )

గందరగోళం సృష్టించే శక్తులను కుట్రలను తిప్పి కొట్టేందుకు బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారుల పాత్ర చాలా కీలకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

Bandi Sanjay: ఐఐఎస్ ట్రైనీ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ భద్రత, సంక్షోభ సమయాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ గందరగోళం సృష్టించే శక్తులను కుట్రలను తిప్పి కొట్టేందుకు బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారుల పాత్ర చాలా కీలకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఐఐఎస్ అధికారులు సమాచార మాద్యమకారులుగా మాత్రమే కాదని, సమాచార సమగ్రతకు, జాతీయ ఐక్యత పరిరక్షకులుగా నిలవాలని సూచించారు. యుద్ధం చేయకుండా సమాచార వ్యాప్తి ద్వారా శత్రువులను మనసులను ప్రభావితం చేయడంలో టీవీ, రేడియో సహా మీడియా సైకలాజికల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. బలాన్ని కాకుండా మేథస్సును ఉపయోగించి చేసే సమాచార యుద్ధంలో ఐఐఎస్ అధికారులు అగ్రభాగాన నిలవాలని కోరారు.

ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్

ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 2009, 2023, 2024 బ్యాచ్ లకు చెందిన గ్రూప్ ఏ ట్రైనీ అధికారులు ఈ నెల 15 నుంచి 22 వరకు అంతర్గత భద్రత, సంక్షోభ, విపత్తు కమ్యూనికేషన్, సైకాలజికల్ ఆపరేషన్స్‌పై అవగాహన పెంపొందించుకునేందుకు శిక్షణ పొందారు. మంగళవారం ఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వేగంగా మారుతున్న సమాచార ప్రపంచంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ కేవలం పరిపాలనా సాధనం మాత్రమే కాదని, జాతీయ స్థిరత్వానికి, ప్రజల విశ్వాసానికి మూలస్థంభమని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే ఫేక్ సమాచారం సవాల్ విసురుతున్న నేటి తరుణంలో వాటిని అధిగమిస్తూ ప్రజలను చైతన్యం చేసేందుకు ఏం చేయాలనే దానిపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్, సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అందించే ప్రత్యేక శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మధ్యవర్తి

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మధ్యవర్తిగా పనిచేసేలా సిద్ధం కావాలని సూచించారు. దేశం తమ మీద ఆశలు పెట్టుకుంది. కేవలం సమాచార మాద్యమకారులుగా మాత్రమే కాదు. సమాచార సమగ్రతకు (ఇన్ఫర్మేషన్ ఇంటెగ్రిటీ), జాతీయ ఐక్యత పరిరక్షకులుగా నిలవాలని సూచించారు. బలాన్ని కాకుండా మేథస్సును ఉపయోగించి చేసే సమాచార యుద్ధంలో అగ్రభాగంలో ఉండలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, కేంద్ర హోంశాఖ మీడియా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ రాజ్ కుమార్, ఐఐఎస్ విభాగం కోర్స్ డైరెక్టర్ రష్మీ రోజా తుషార నాయర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story