- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగుల పెండింగ్ డీఏలు, బకాయిలు తక్షణమే చెల్లించాలి : సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్డీఏలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్డీఏలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా వివరిస్తూ.. రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 డీఏలను పెండింగ్ లో ఉంచింది. ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలను కూడా చెల్లించడం లేదు. 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని రెండున్నరేళ్లు అవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. కనీసం పీఆర్సీ రిపోర్ట్ ను కూడా తెప్పించకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. 2024 నుండి నేటి వరకు దాదాపు 13 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురి చేస్తుండటం సరికాదన్నారు. మానవత్వం ఉన్న పాలకులు ఎవరూ ఇంతటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారని, బెన్ ఫిట్స్ అందకా గత ఏడాది నుండి ఇప్పటి వరకు 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు లోనై మరణించారు. ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వం కారణం అవుతుందన్నారు.
రూ.12 వేల కోట్లకు పైగా బకాయిలు..
రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కలిపితే రూ.12 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా రూ.2.5 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించడం భారంగా భావించడం అంటే అంతకంటే దురదృష్టకరమైన విషయం ఉండదన్నారు. ఇక నుంచి వారి పట్ల నిర్లక్ష్య ధోరణిని విడనాడి బకాయిలన్నీ చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ బకాయిలను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలన్నారు. లేనిపక్షంలో మున్సిపల్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని హెచ్చరించారు. అవసరమైతే హైదరాబాద్ నడిబొడ్డున ఆయా ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకునేందుకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు.






