కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. కలెక్టర్‌కు కీలక సూచనలు

by Ramesh Naini |

జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజీ సమీపంలో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. కలెక్టర్‌కు కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజీ సమీపంలో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పక్కపక్కనే ఉన్న సుమారు 30 బొమ్మల దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది. ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే, సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.

ఈ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కొండగట్టు స్టేజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం ఘటన బాధాకరం అని ఆవేదన చెందారు. ఇదే అంశంపై జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగిందని వెల్లడించారు. ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు నిర్వాసితులకు అండగా నిలవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story