- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు, బీజేపీ నేతల అరెస్టు అక్రమం, విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు: బండి సంజయ్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేయడం అక్రమమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేయడం అక్రమమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులను స్టేషన్ కు తరలించడం సరికాదని, తక్షణమే రైతులను, నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రంగనాయక్ సాగర్ నుంచి పెద్ద లింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ, రూ.3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని నిలదీశారు.
కెనాల్ పనులను పూర్తి చేయాలి
కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రంగ నాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలతో వరుసగా రైతులు పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పనులు ప్రారంభించకపోతే ఆయా ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే రంగ నాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.






