అబద్ధాల్లో సీఎంకు 'ఆస్కార్' ఇవ్వొచ్చు : కేంద్ర మంత్రి బండి సంజ‌య్

by Ratna Kumari |   (  Updated:2026-04-04 11:03:24  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అబద్ధాల్లో సీఎంకు ఆస్కార్ ఇవ్వొచ్చు :  కేంద్ర మంత్రి బండి  సంజ‌య్
X

దిశ, ​హుజురాబాద్ రూరల్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం హుజురాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడటంలో ఆరితేరారు. ఆయనకు అబద్ధాలలో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు" అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, నిరుద్యోగ భృతి ఊసేలేదని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన నగదు కూడా అందడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, లేని పక్షంలో సీఎం తన పదవికి రాజీనామా చేయాలని బహిరంగ సవాల్ విసిరారు.

​కాంగ్రెస్ ఓటములకు రేవంతే కారణం

​ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పై స్పందిస్తూ.. బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి రేవంత్ రెడ్డి తీరు కూడా ఒక కారణమని విమర్శించారు. కేరళలో కూడా త్వరలో అదే పరిస్థితి పునరావృతమవుతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ పెద్దలకు స్పెషల్ ఫ్లైట్లలో డబ్బు మూటలు పంపుతున్నారని ఆరోపించిన ఆయన, కేరళ మీడియా తెలంగాణకు వచ్చి ఇక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు.

​డంపింగ్ యార్డుపై పోరాటం తప్పదు

​హుజురాబాద్ శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటును బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో నెమళ్లు, వివిధ రకాల పక్షులు ఉన్నాయని, డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ డంపింగ్ యార్డులకు వ్యతిరేకం కాదని, కానీ అది ప్రజలకు ఇబ్బంది కలగని దూర ప్రాంతాల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఈ నిర్మాణ స్థలాన్ని సీఎం స్వయంగా పరిశీలించాలని లేదా పూర్తి నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. ​"అవసరమైతే లాఠీ దెబ్బలు తినడానికైనా సిద్ధం.. కానీ హుజురాబాద్‌లో డంపింగ్ యార్డును మాత్రం నిర్మించనివ్వం" అని బండి సంజయ్ హెచ్చరించారు. సెంట్రల్ యూనివర్సిటీలో చేసిన అరాచకాలను ఇక్కడ సాగనివ్వబోమని అధికారులను హెచ్చరించారు.

Next Story