ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 5.1 శాతం

by Yella Dhawani Reddy |

దేశ వ్యాప్తంగా ఏప్రిల్‌ మాసంలో నిరుద్యోగిత రేటు 5.1 శాతం ఉన్నట్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక వెల్లడించింది.

ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 5.1 శాతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా ఏప్రిల్‌ మాసంలో నిరుద్యోగిత రేటు 5.1 శాతం ఉన్నట్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక వెల్లడించింది. 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 5.1 శాతం ఉందని పేర్కొంది. ఇందులో పురుషుల రేటు 5.2 శాతం, మహిళల రేటు 5.0 శాతంగా ఉందని గణాంకాలు పేర్కొంటున్నాయి. జాతీయ స్థాయిలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) కీలకమైన శ్రామిక శక్తి సూచికలను నెలవారీగా విడుదల చేస్తామని వెల్లడించింది. జాతీయ నమూనా సర్వే (NSS) ఈ నిర్ణయం తీసుకుంది. అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన కార్మిక మార్కెట్ సూచికల అవసరాన్ని పరిష్కరించడానికి జనవరి 2025 నుంచి ఈ సర్వే నమూనా రూపకల్పనను పునరుద్ధరించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నెలవారీ ప్రాతిపదికన శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, కార్మికుల జనాభా నిష్పత్తి, నిరుద్యోగ రేటు వంటి కీలక ఉపాధి, నిరుద్యోగ సూచికలను పరిష్కరించడానికి ఈ సర్వేను పునరుద్ధరించారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిరుద్యోగితను నిర్మూలించుకునేందుకు చర్యలు తీసుకోనున్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే జూలై 2017 నుంచి జూన్ 2024 వరకు సర్వే ఫలితాలను విడుదల చేసింది. అనంతరం ఈ సర్వే కార్యక్రమాన్ని నిలిపివేశారు.

తాజాగా దీనిని పునరుద్ధరించారు. ఏప్రిల్, 2025 నెలకు సంబంధించిన సర్వే ఫలితాలను వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో, నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 4.5 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో పురుషులలో 5.8 శాతం కంటే స్త్రీలలో 8.7 శాతం ఎక్కువగా నిరుద్యోగిత రేటు నమోదు అయింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో, మహిళల నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో పురుషులలో 4.9 శాతం కంటే 3.9 శాతం తక్కువగా ఉంది. గ్రామీణ-పట్టణ విభజన పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పించేందు తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని నిపుణులు తెలిపారు. ఉపాధి స్థితి పరంగా, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి ఎక్కువగా ఉంది (పురుషులలో 55.3 శాతం, స్త్రీలలో 71.6శాతం), అయితే పట్టణ ప్రాంతాల్లో రెగ్యులర్ వేతనం లేదా జీతాలు పొందే ఉపాధి ఎక్కువగా (పురుషులలో 47.5శాతం, స్త్రీలలో 55.1శాతం) ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. పని రంగం విషయానికొస్తే, వ్యవసాయ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది కార్మికులు (పురుషులలో 44.6శాతం , మహిళలు 70.9శాతం) పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే పట్టణ ప్రాంతాలలో (పురుషులలో 60.6శాతం, మహిళలు 64.9శాతం) కార్మికులుగా ఉన్నారు. ఈ త్రైమాసికలో దేశంలో సగటున 56.4 కోట్ల మంది కార్మికులు(15 సంవత్సరాలు పైబడిన వారు) ఉపాధి పొందారు, వీరిలో 39.7 కోట్ల మంది పురుషులు, 16.7 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2025 ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు (UR) 5.4శాతం నమోదైంది. 2025 ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాలలో 6.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.8 శాతం తక్కువగా నమోదైయింది.

Next Story