ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ అమ్మకాలు.. 190 మెడికల్ షాపులపై చర్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-21 16:21:19  IST  )

యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ను నియంత్రించే చర్యల్లో భాగంగా రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ(డీసీఏ) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా పలు మందుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ అమ్మకాలు.. 190 మెడికల్ షాపులపై చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ను నియంత్రించే చర్యల్లో భాగంగా రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ(డీసీఏ) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా పలు మందుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 190 మందుల షాపుల్లో యాంటీబయాటిక్స్ అమ్మకాలకు సంబంధించి అనేక అవకతవకలను అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈ 190 షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (డాక్టర్) ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ అమ్మడం, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండా మందులు అమ్మడం, యాంటీబయాటిక్స్ కు సంబంధించి ‘షెడ్యూల్ హెచ్-1’ డ్రగ్ రిజిస్టర్, ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్లను నిర్వహించకపోవడం వంటి లోపాలను అధికారులు తనిఖీల్లో గుర్తించారు.

మందులు పనిచేయకుండా పోతాయి...

యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ వల్ల భవిష్యత్తులో యాంటీ బయోటిక్స్ పనిచేయకుండా పోతాయని డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం తెలిపారు. ప్రపంచ ఆరోగ్య ముప్పుగా ఏఎంఆర్ మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందన్నారు. మానవాళికి పొంచి ఉన్న టాప్-10 ఆరోగ్య ముప్పుల్లో 'యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్' ఒకటని ఆయన తెలిపారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మరణాలకు ఇది ప్రత్యక్ష కారణమని... ప్రపంచంలోనే అత్యధిక ఏఎంఆర్ సగటు ఉన్న దేశాలలో మన దేశం కూడా ఒకటని హెచ్చరించారు. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ వంటి మందులను సరైన విధంగా వాడితేనే ప్రాణాలు నిలబడతాయని... వీటిని తప్పుగా లేదా విచ్చలవిడిగా వాడటం వల్ల బ్యాక్టీరియా ఆ మందులను తట్టుకునే శక్తిని పెంచుకుంటుందని... దీనినే 'డ్రగ్ రెసిస్టెన్స్' అంటారని షానవాజ్ ఖాసిం పేర్కొన్నారు. దీనివల్ల సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గవని... ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ఇలా తయారైన బ్యాక్టీరియాను ‘సూపర్ బగ్స్’ అంటారని వివరించారు. అర్హత కలిగిన డాక్టర్ రాసిస్తేనే యాంటీబయాటిక్స్ వాడాలన్నారుయ సొంత వైద్యం సరికాదన్నారు. జలుబు, దగ్గు వంటివి సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవన్నారు. అనవసరంగా వాడితే భవిష్యత్తులో ఆ మందులు సదరు రోగికి పనిచేయకుండా పోతాయన్నారు.

Next Story