- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క పంచాయతీ.. ఇద్దరు సర్పంచ్‌లు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఏ ఎన్నికలు అయిన సాధారణంగా ఒక సీటుకు ఒకరే విజేత ఉంటారు. కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో మాత్రం ఎన్నికల అధికారులు కొత్త రికార్డు సృష్టించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏ ఎన్నికలు అయిన సాధారణంగా ఒక సీటుకు ఒకరే విజేత ఉంటారు. కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో మాత్రం ఎన్నికల అధికారులు కొత్త రికార్డు సృష్టించారు. ఒకే సర్పంచ్ పదవికి ఏకంగా ఇద్దరు అభ్యర్థులకు ‘గెలుపు’ సర్టిఫికెట్లు ఇచ్చి, గ్రామంలో సంచలనం రేపారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ఇద్దరు అభ్యర్థులు బంధుమిత్రులతో సిద్ధమవడంతో అధికారులకు ఇప్పుడు అసలైన ‘తలపోటు’ మొదలైంది.
ఓట్ల లెక్కింపు రోజున మొదటగా బీఆర్ఎస్ మద్దతుదారు స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి (RO) అధికారికంగా ప్రకటించి, ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. గెలిచామన్న ఆనందంతో స్వాతి వర్గం సంబరాలు మొదలు పెట్టింది. అయితే, సరిగ్గా అరగంట గడవకముందే సీన్ రివర్స్ అయింది. రీ-కౌంటింగ్, సాంకేతిక కారణమేదైనా కానీ, అధికారులు ఒక్కసారిగా కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఒక ఓటు తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించి, ఆమెకు కూడా విక్టరీ సర్టిఫికెట్ ఇచ్చేశారు.
ప్రమాణ స్వీకారానికి ఇద్దరూ రెడీ..
ఎన్నికల్లో గెలిచినట్లు ఎన్నికల అధికారి నుంచి అధికారిక పత్రాలు అందడంతో ఇద్దరు అభ్యర్థులు తమ బంధువులను, సన్నిహితులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. కానీ అసలు విషయం తెలిశాక ఊరి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. "ఒకే కుర్చీలో ఇద్దరం ఎలా కూర్చుంటాం?" అని అభ్యర్థులు ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నములు తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒకే గ్రామంలో ఇద్దరు సర్పంచ్‌లు తయారవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ చిక్కుముడిని ఉన్నతాధికారులు ఎలా విప్పుతారో వేచి చూడాలి. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






