Handloom Awards: ఇద్దరు తెలంగాణ వాసులను వరించిన చేనేత పురస్కారాలు

by Prasad Jukanti |   (  Updated:2025-07-21 13:01:03  IST  )

కేంద్రం చేనేత పురస్కారాలు-2024 ప్రకటించింది.

Handloom Awards: ఇద్దరు తెలంగాణ వాసులను వరించిన  చేనేత పురస్కారాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి గాను చేనేత రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు (Handloom Awards) ప్రకటించింది. ఈ సంవత్సరం 5 సంత్ కబీర్ అవార్డులు 19 జాతీయ చేనేత అవార్డులు సహా మొత్తం 24 మందికి కేంద్రం అవార్డులు ప్రకటించింది. మొత్తం 19 మందిని చేనేత అవార్డులకు ఎంపిక చేయగా ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక అయ్యారు. యువ చేనేత విభాగంలోగూడ పవన్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదకు అవార్డులు వరించాయి. వీటిని 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 7న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే వీరిద్దరిది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక కావడం గమనార్హం.

గూడ పవన్ సహజ సిద్ధమైన రంగులను పట్టుదారానికి అద్ది జిఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్ తో పట్టుచీరను నేశారు. ఈ చీరలు ప్రాచీన సంప్రదాయం ప్రతిబింబించి ఆకృతులు అద్ది ముడతలు పడని మృదుత్వంతో చీరను రూపొందించారు. ఇక పుటపాక గ్రామానికి చెందిన గజం నర్మద హైదరాబాదులో నరేందర్ హ్యాండ్లూమ్స్ పేరుతో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా చేనేత వస్త్రాల అమ్మకంలో 8 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చేనేత అవార్డుల-2024 పురస్కారంలో మార్కెటింగ్ విభాగంలో ఆమెకు అవార్డు వరించింది.

Next Story