మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగింతో క్లారిటీ ఇచ్చిన మృతుడి భార్య

by Prasad Jukanti |   (  Updated:2026-02-12 07:12:08  IST  )

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది.

మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగింతో క్లారిటీ ఇచ్చిన మృతుడి భార్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ (Makthal Municipality) 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య కేసు (Mahadevappa Suicide Case) కీలక మలుపు తిరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపుల వల్లే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారంటూ బీజేపీ ఆరోపిస్తున్న వేళ తన భర్త ఆత్మహత్యపై మృతుడి భార్య సత్యమ్మ క్లారిటీ ఇచ్చింది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదులో సంచలన విషయాలు అమె పేర్కొంది. తన భర్త మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని మా వార్డులోని ఓటర్లు నా భర్తకు ఓటు వేయరనే భయంతోనే ఆయన క్షణికావేశంలో మా ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఆత్మహత్య విషయంలో తగుచర్య తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదు కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా 194 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ముందు అలా ఇప్పుడు ఇలా:

అయితే భర్త ఆత్మహత్య చేసుకున్న వెంటనే మహాదేవప్ప భార్య సత్యమ్మ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడుతూ తన భర్తకు ఫోన్‍లో ఏవో బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ఆమె ఆరోపించారు. అయితే పోలీసులకు మాత్రం ఓటమిభయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‍గా మారింది. కాగా మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలో పోలింగ్‍కు ఒక రోజు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. మహదేవప్ప మరణంపై బీజేపీ భగ్గుమంది. మహాదేవప్ప మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన రోజే బీజేపీ శ్రేణులు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.ఈ అంశం పార్లమెంట్ వరకు సైతం పాకింది. తీరా తన భర్త విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి భార్య స్టేట్ మెంట్ ఇవ్వడం చర్చనీయంగా మారింది.

నా కాల్ డేటా చెక్ చేసుకోండి:

మరో వైపు మహాదేవప్ప మృతి విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి వాకిటి శ్రీహరి ఖండించారు. మహాదేవప్ప మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నాపై ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధం అని, మృతుడికి నేను కాల్ చేయలేదని కావాలంటే నా కాల్ డేటా చెక్ చేసుకోవాలంటూ చాలెంజ్ చేశారు. రాకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు దిగజారుడు సరికాదన్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప మరణం ఆయన కుటుంబానికి తీరని విషాదం నింపగా ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఏం తేల్చబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story